Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలో రాజకీయంగా ఉద్రిక్తతతలకు కారణమవుతోంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, రాహుల్ గాంధీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు.
‘‘మేము ఇప్పుడు ఏదైనా చర్య తీసుకుంటే, రాజకీయ ఎత్తుగడ అని పేర్కొంటారు’’ అని హిమంత అన్నారు. అస్సాంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పోలీసులు కేసు నమోదు చేసిన ఒక రోజు తర్వాత సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ ఏకైక లక్ష్యం వివాదాన్ని ప్రారంభించడమే అని ఆయన విమర్శించారు.
Read Also: PM Modi: ఫిబ్రవరిలో కేంద్రమంత్రులు ఎవరూ అయోధ్యకు వెళ్లొద్దని ప్రధాని ఆదేశాలు.. కారణమిదే..
యాత్ర లక్ష్యం కేవలం అస్సాంలోని శాంతికి విఘాతం కలిగించడమే, అతని ముఖ్య ఉద్దేశం ప్రజల తన వైపు చూడాలని అనుకోవడమే అని, దాన్ని మేం ఓడించామని సీఎం హిమంత అన్నారు. అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని, నిన్న గౌహతిలో పెద్ద సంఘటన జరిగేదిని, దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయని దీనిపై మేము సిట్‌ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామని సీఎం వెల్లడించారు.
ఇదిలా ఉంటే రామ మందిర వేడుక రోజు తమ యాత్రపై బీజేపీ గుండాలు దాడులు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. బటద్రవా ధామ్ ఆలయంలోకి వెళ్లకుండా తమపై పోలీసులు నిషేధం విధించారని అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తనపై ఎన్నైనా కేసులు పెట్టడం, బీజేపీ/ఆర్ఎస్ఎస్ నన్ను బెదిరించలేవని అన్నారు.