Manipur: జాతి సంఘర్షణ కారణంగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రం రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును మూసేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం గగనతలంలో గుర్తుతెలియన డ్రోన్ కనిపించింది. వెంటనే విమాన కార్యకలాపాలను మూసివేయాని అధికారులు ఆదేశించారు.
ఇంఫాల్ లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఫ్లైయింగ్ ఆబ్జెక్టును గుర్తించారు. దీంతో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే 2 విమానాలను కోల్‌కతాకి డైవర్ట్ చేయగా.. మరో మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్ డైరెకర్టర్ చిపెమ్మి కీషింగ్ డ్రోన్ చూసినట్లు ఒక ప్రకటనలో ధృవీకరించారు. కాంపిటెంట్ అథారిటీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మూడు విమానాలు బయలుదేరాయని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది మే 3న మణిపూర్ రాష్ట్రంలో ప్రారంభమైన జాతి ఘర్షణలు ఇప్పటికీ ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రభావం చూపిస్తున్నాయి. నవంబర్ 23 వరకు మరో ఐదురోజుల పాటు ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్‌పై బ్యాన్ విధించింది. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మైయిటీ వర్గం పోరాడుతుంటే.. దీన్ని వ్యతిరేకిస్తూ మే 3న కుకీ తెగతో పాటు మరికొన్ని తెగలు ‘గిరిజన సంఘీభావ యాత్ర’ చేపట్టింది. ఇది ఈ రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోసింది. ఇరు వైపులా 200 మంది చనిపోయారు. చాలా మంది ప్రజలు సొంతప్రాంతాల నుంచి వలస వెళ్లాల్సి వచ్చింది.