Priyanka Gandhi: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టాయి. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఒటేయడంతో ఆ రాష్ట్రంలోని ఒకే ఒక రాజ్య సభ సీటులో కమలం గెలిచింది. ఇదిలా ఉంటే, దీని తర్వాత రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం, కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సుఖు రాజీనామా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని ఆయన కొట్టిపారేశారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఎలాగైనా ప్రభుత్వాన్ని కాపాడే పనిలో తనమునకలై ఉంది. మరో వైపు హిమచల్ మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకువచ్చింది.
తాజాగా హిమాచల్ పరిణామాలపై కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పందించారు. కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా సవాల్ చేస్తుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉందని, హిమాచల్ ప్రజలు ఈ హక్కును ఉపయోగించుకున్నారని, స్పష్టమైన మెజారిటీలో కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేసిందని, అయితే, బీజేపీ తన ధన బలాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజల హక్కుల్ని అణిచివేయాలని అనుకుంటోందని ప్రియాంకాగాంధీ ఆరోపించారు.
Read Also: Chinese flag on Isro ad: డీఎంకే ఇస్రో ప్రకటనలో “చైనా జెండా”.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి హర్యానాకు వెళ్లారు. ఈ రోజు సిమ్లాకు తిరిగి వచ్చారు. వీరితో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ రోజు వీరికి అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు డప్పు చప్పుళ్లతో, నినాదాలతో స్వాగతం పలికారు. అంతకుముందు, సీఎం సుఖు మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసిందని, సీఆర్‌పీఎఫ్ సాయంతో వారిని హర్యానాకు తీసుకెళ్లారని ఆరోపించారు.
ప్రభుత్వం భద్రతను, యంత్రాంగాన్ని బీజేపీ ఉపయోగించుకుంటున్న తీరు దేశ చరిత్రలో మునుపెన్నడూ లేదని, 25 ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్యేలను సవాల్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం అవుతోందని ప్రియాంకాగాంధీ అన్నారు. వారి చర్యల్ని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారని, ప్రకృతి విపత్తు సమయంలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలవని బీజేపీ ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ విపత్తులోకి నెట్టాలనుకుంటోంది ఆమె ఆరోపించారు.