NTV Telugu Site icon

Congress: హిమాచల్ చేజారితే.. ఈ రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్‌కి దిక్కు..

Congress

Congress

Congress: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఒక్క రాజ్యసభ ఎంపీని గెలిపించుకోలేకపోయింది. బీజేపీ పార్టీకి 25 ఎమ్మెల్యేలు ఉండగా.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో బీజేపీ రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ పరిణామాలు ఆ రాష్ట్రంలో సీఎం సుఖ్వీందర్ సుఖు ప్రభుత్వాన్ని సంక్షోభం అంచుకు తీసుకెళ్లింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‌గఢ్ రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ పరిణామాలు కలవరపెడుతున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సుఖు, ఈ తర్వాత తాను రాజీనామా చేయడం లేదని, తాను పోరాటం కొనసాగిస్తానని అన్నారు.

Read Also: Uttar Pradesh: ప్రభుత్వ స్కీమ్ పొందేందుకు భర్తనే మార్చేసింది.. వేరే వ్యక్తితో పెళ్లి తంతు..

హిమాచల్ చేజారితే, సొంతగా కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నట్లు అవుతుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమితో అధికారం పంచుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం 35 మ్యాజిక్ ఫిగర్ కాగా.. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత సీఎం వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా కాంగ్రెస్‌కి ఎదురుతిరగడంతో ఆ పార్టీకి సమస్య మరింత పెరిగింది. సుఖు ప్రభుత్వం తమను విస్మరించిందని ఆయన ఆరోపించారు.

క్రాస్ ఓటింగ్ అనంతరం బీజేపీ ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్, పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. బలపరీక్ష నిర్వహించాలని కోరారు. ఇదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వ కుప్పకూలే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరో 3 నెలల వరకు లేవు. అయితే సుఖు ప్రభుత్వానికి మెజారిటీ ఎమ్మెల్యేల విశ్వాసం ఉందో లేదో తెలుసుకునేందుకు గవర్నర్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వొచ్చు.

గత వైభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్:

హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ సొంతగా అధికారంలో ఉంది. జార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాల్లో జూనియర్ భాగస్వామిగా ఉంది. ఒక వేళ హిమచల్‌లో ప్రభుత్వం కూలిపోతే, కేవలం దక్షిణాది మాత్రమే కాంగ్రెస్‌కి దిక్కవుతుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో కాంగ్రెస్‌కి బలం ఉంది. కేరళ, కర్ణాటక, తెలంగాణల్లో ఈ పార్టీకి మంచి పట్టు ఉంది. కర్ణాటక, తెలంగాణలకు గతేడాది ఎన్నికలు జరగగా, కేరళలో 2026 వరకు అసెంబ్లీ ఎన్నికలు లేవు.

Show comments