Yogi Adityanath: జ్ఞానవాపి మసీదు వివాదం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వారణాసి కోర్టు జ్ఞానవాపి సెల్లార్‌లో పూజలకు హిందువులను అనుమతించింది. దీనిపై పలువురు ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి వార్నింగ్ ఇస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఎంసీ నేత సిద్ధిఖుల్లా చౌదరి మాట్లాడుతూ.. ‘‘సీఎం యోగి బెంగాల్ వస్తే అతడిని మేము చుట్టుముడుతాం’’ అంటూ హెచ్చరించాడు. హిందువులు జ్ఞానవాపిని వెంటనే ఖాళీ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. మసీదులో పూజలూపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో జరిగిన ఉలేమా-ఎ-హింద్ ర్యాలీలో ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ఏమైనా తెలివి ఉందా..? అని ప్రశ్నించారు. అతను బెంగాల్‌లో ఉంటే బయటకు వెళ్లేందుకు కూడా అనుమతించబడడు అని అన్నారు.
Read Also: Asaduddin Owaisi: దేశానికి మోడీ బాబా అవసరం లేదు.. పార్లమెంట్‌లో ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.
హిందువులు అక్కడ బలవంతంగా పూజలు చేయడం ప్రారంభించారు, వెంటనే జ్ఞానవాపిని ఖాళీ చేయాలని అతను కోరాడు. మేము ప్రార్థనలు చేయడానికి ఏ ఆలయానికి వెళ్లడం లేదని, హిందువులు మసీదులోకి ఎందుకు వస్తున్నారని, మసీదు అంటే మసీదే అని, దాన్ని దేవాలయంగా మార్చేందుకు చూస్తే మేం నిశ్శబ్ధంగా చూస్తూ కూర్చోలేమని అన్నారు. అక్కడ 800 ఏళ్లుగా అక్కడ మసీదు ఉందని దానిని ఎలా కూల్చేస్తారు..? అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక నిర్ధిష్ట వర్గానికి రక్షకుడిగా మారిందని ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ ఒక సనాతుడని అతడిని బెదిరించడం దేశానికి మంచిది కాదని, యోగిని బెంగాల్ వెళ్లకుండా అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు.