Indian Woman: గతేడాది నవంబర్ నెలలో సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్తాన్లో తీర్థయాత్రకు వెళ్లిన ఒక మహిళ మళ్లీ భారత్ తిరిగి రాలేదు. అక్కడే ఒక పాకిస్తానీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. భారతీయ మహిళ సారబ్జీత్ కౌర్ పాకిస్తాన్‌లోనే సెటిల్ అయింది. అయితే, కొన్ని రోజుల్లోనే తాను ఎలాంటి నరకంలోకి కోరి వచ్చాననే విషయం త్వరలోనే తెలిసింది. ఆమెకు చెందినదిగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్‌తోని తన మాజీ భర్తతో మాట్లాడుతున్నట్లు ఈ ఆడియోలో ఉంది.
పాకిస్తాన్లో తనను వేధిస్తున్నారని పేర్కొంటూ, తనను వెంటనే భారత్ తీసుకురావాలని ప్రాధేయపడింది. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలోని అమన్పూర్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల ఈ సిక్కు మహిళ, గురునానక్ జయంతికి సంబంధించిన ఉత్సవాలకు హాజరయ్యేందుకు గత ఏడాది నవంబర్‌లో వాఘా సరిహద్దు మీదుగా పాక్ వెళ్లింది. ఇలా పాక్ వెళ్లిన 2000 మంది సిక్కు యాత్రికుల్లో ఈమె కూడా ఒకరు. ఆ సమయంలో వెళ్లిన వారు అంతా భారత్ తిరిగి వచ్చారు, ఒక్క సారబ్జీత్ కౌర్ తప్పా. నవంబర్ 4న పాక్ వెళ్లిన ఒక రోజు తర్వాత, ఆమె లాహోర్‌కు సుమారు 50 కి.మీ దూరంలో ఉన్న షేఖుపురా జిల్లాకు చెందిన నాసిర్ హుస్సేన్‌ను వివాహం చేసుకుంది.
Read Also: PM Modi: తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన మోడీ
నా పరిస్థితి బాగోలేదు:
ఒక క్లిప్‌లో కౌర్ మాట్లాడుతూ.. తన పరిస్థితి పాకిస్తాన్లో బాగోలేదని, తాను వివాహం చేసుకున్న వ్యక్తి, అతడి కుటుంబం వేధిస్తున్నారని చెప్పింది. తాను భారత్ తిరిగి రావాలనుకుంటున్నానని, తిరిగి వచ్చిన తనకు ఎలాంటి హాని కలిగించవద్దని సదరు వ్యక్తిని కోరుతోంది. ‘‘ఇక్కడ నన్ను వేధిస్తున్నారు. నా పిల్లలు లేకుండా నేను జీవించలేను. ఒకప్పుడు నేను ప్రజలకు లక్షల రూపాయలు ఇచ్చే దానిని, నేను ఒక సర్దార్ని, ఇప్పుడు నేను డబ్బు కోసం వేడుకోవాల్సి వస్తోంది’’ అని ఆడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను గూఢచారిగా పాక్ వెళ్లలేదని, తన అశ్లీల ఫోటోలు నాసిర్ హుస్సేన్ దగ్గర ఉన్నాయని, వాటిని తొలగించడానికి వెళ్లాలనని మహిళ చెప్పింది.
గతంలో కౌర్ తాను విడాకులు తీసుకున్నానని, హుస్సేన్‌ను పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చానని చెప్పింది. తన వీసా పొడగించాలని ఇస్లామాబాద్ రాయబార కార్యాలయాన్ని కోరింది. పాకిస్తాన్ జాతీయత కోసం దరఖాస్తు చేసుకుంది. నిఖా వేడుక తర్వాత తన పేరును కౌర్ నుంచి నూర్‌గా మార్చుకుంది.