ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. బ్రూనై, సింగపూర్ టూర్‌కు వెళ్లారు. అక్కడ నుంచి రాగానే జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొననున్నారు. మూడు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్‌లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 370వ అధికరణ రద్దు, అనంతరం జరిగిన అభివృద్ధి, జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సీట్ల కోటా కల్పించడం వంటి అంశాలే ప్రచారాస్త్రాలుగా ప్రధాని పర్యటన ఉంటుందని తెలుస్తోంది.
డీలిమిటేషన్ తర్వాత 43 అసెంబ్లీ స్థానాలైన జమ్మూలో కనీసం 35 సీట్లు గెలుచుకుని, కశ్మీర్‌లో తగినన్ని సీట్లు దక్కించుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించాలని బీజేపీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక హర్యానాలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 5న ఇక్కడ ఓటింగ్ జరగనుంది. ఇక్కడ కూడా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. అలాగే ఇండియా కూటమి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.