Katchatheevu: ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కచ్చతీవు దీవుల అంశం చర్చనీయాంశంగా మారింది. 1970లలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత్‌కి చెందిన హిందూ మహాసముద్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే నేత కరుణానిధి ఉన్నారు. తాజాగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మిత్రపక్షాలుగా పోటీచేస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ దీవుల్ని శ్రీలంకకు అప్పగించడంతో తరుచుగా తమిళనాడు మత్స్యకారులను ఆ దేశ నేవీ అరెస్ట్ చేయడంతో పాటు బోట్లను జప్తు చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ వివాదంపై బుధవారం శ్రీలంక విదేశాంగ మంత్రి బుధవారం స్పందించారు. ఈ ద్వీపానికి సంబంధించిన సమస్య పరిష్కారమైందని, ఎలాంటి వివాదం లేదని లంక మంత్రి అలీ సబ్రీ అన్నారు. ‘‘దీనిపై ఎలాంటి వివాదం లేదని, అయితే ద్వీపం అప్పగింతలో ఎవరు బాధ్యులతనే అంతర్గత రాజకీయ చర్చలు జరుగుతున్నాయి’’ అని అంతే తప్పా కచ్చతీవుపై ఎవరూ మాట్లాడటం లేదని ఆయన చెప్పారు. ఈ సమస్య 50 ఏళ్ల క్రితమే పరిష్కారమైందని, దానిని మళ్లీ తెరవాల్సిన అవసరం లేదని అన్నారు.
శ్రీలంక మంత్రివర్గం కచ్చతీవుపై ఇప్పటి వరకు చర్చించలేదని శ్రీలంక అని క్యాబినెట్ అధికార ప్రతినిధి మరియు సమాచార మంత్రి బందుల గుణవర్ధన బుధవారం మీడియాతో అన్నారు. కచ్చతీవు వివాదంపై శ్రీలంక మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర స్పందన కనిపించినప్పటికీ, ప్రభుత్వ పరంగా పెద్దగా స్పందన లేదు. విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందనే కచ్చతీవుపై శ్రీలంక అధికార స్పందన అవుతుంది. భారతదేశంలో బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్ కూటమి మధ్య కచ్చతీవు వివాదాస్పద అంశంగా మారిందని అక్కడి మీడియా నివేదించింది.
స్నేహపూర్వక పొరుగు వారి ప్రమాకరమైన, అనవసరమైన రెచ్చగొట్టే వాదన తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అక్కడి ‘ది డైలీ ఫైనాన్షియల్ టైమ్స్’ ఎడిటోరియల్ కాలమ్ పేర్కొంది. కొలంబోకు చెందిన డైలీ మిర్రర్ తన సంపాదకీయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని లక్ష్యంగా చేసుకుంది. తమిళనాడు ఓట్లను పొందడానికి మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ప్రధాని(పీఎంమోడీ)తో చేతులు కలిపారని డైలీ మిర్రర్ వ్యాఖ్యానించింది. తమిళ వర్గానికి చెందిన శ్రీలంక మంత్రి జీవన్ తొండమాన్ మాట్లాడుతూ.. కచ్చతీవు శ్రీలంక అధికార పరిధిలోకి వస్తుందని అన్నారు. భారత్ విదేశాంగ విధానం శ్రీలంకతో ఆరోగ్యకరంగా ఉందని అన్నారు.