Kamal Nath: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కీలక నేతలు చేజారిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎంగా ఉన్న కమల్ నాథ్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సోషల్ మీడియాలో తన బయో నుంచి కాంగ్రెస్‌ని తొలగించడం వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు ఈ రోజు కమల్ నాథ్ న్యూఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడే బీజేపీ పెద్దలతో భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: CPI Ramakrishna: బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు..! వారికే కాదు రాష్ట్రానికీ అరిష్టం..!
మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి కమల్ నాథ్‌తో తాను మాట్లాడానని, అతను చింద్వారాలో ఉన్నారని, నెహ్రూ-గాంధీ కుటుంబంతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ కుటుంబాన్ని విడిచిపెడతారని తాము అనుకోవడం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడి శర్మ శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ నిర్ణయాలతో కలత చెందుతున్నారని అన్నారు. అయోధ్యలోని రామమందిరం ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ వేడుకకు పార్టీ ఆహ్వానాన్ని తిరస్కరించడంతో కలత చెందిన ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలకు పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ నిన్న అన్నారు.
ప్రస్తుతం కమల్ నాథ్‌తో పాటు చింద్వారా నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా ఉన్న ఆయన కుమారుడు నకుల్ నాథ్ కూడా బీజేపీలో చేరుతున్నట్లు సమచారం. 2019 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిస్తే, ఒక్క చింద్వారా నుంచి నకుల్ నాథ్ విజయం సాధించారు.