Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా కేంద్ర ప్రకటిస్తుందని, గోవధను నిషేధిస్తుందని అలహాబాద్ హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ మతంలో ఆవుకు చాలా ప్రాముఖ్యత ఉందని కోర్టు విశ్వసిస్తోందని పేర్కొంది. మనం లౌకిక దేశంలో జీవిస్తున్నామని, అన్ని మతాలను గౌరవించాలని, హిందూ మతంలో ఆవును దైవంగాీ భావిస్తారని, కాబట్టి ఆవును రక్షించాలి, పూజించాలని జస్టిస్ షమీమ్ అహ్మద్ ఫిబ్రవరి 14న వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ గోహత్య నిరోధక చట్టం, 1955 కింద ఒక వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. బారాబంకి నివాసి మహ్మద్ అబ్దుల్ ఖలీక్, పోలీసులు ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై కేసు పెట్టారని, అందువల్ల అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న విచారణలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అతని విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం, పిటిషనర్ పై రికార్డులో ఉన్న వాస్తవాల ప్రకారమే కేసు పెట్టబడిందని పేర్కొంది.
Read Also: Law Minister Kiren Rijiju: న్యాయవ్యవస్థ ప్రజా విమర్శలకు దూరంగా ఉండాలి..
ఉత్తర్వులు జారీ చేస్తున్న సమయంలో కోర్టు ఆవు గొప్పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవు వివిధ దేవీదేవతలో సంబంధం ఉందని, ముఖ్యంగా శివుడు(నంది), ఇంధ్రుడు(కామధేనువు), శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లతో సంబంధం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. పురాణాల ప్రకారం క్షీరసముద్రం చిలికే సమయంలో ఆవు ఉద్భవించిందని, ఆవు పాలు నాలుగు పురుషార్థాలు( ధర్మం, అర్థం, కామం, మోక్షం) ప్రతీక అని, ఆవు కొమ్ములు దేవతలను, ఆవు ముఖం సూర్యచంద్రులను సూచిస్తాయని పేర్కొంది.
ఆవును పూజించడం వేదకాలం నుంచి ఉందని జస్టిస్ అహ్మద్ అన్నారు. ఆవును ఋగ్వేదంలో “వధించలేనిది”గా పేర్కొన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆవును వధించడం మహాభారతంలో కూడా నిషేధించబడిందని అన్నారు. పంచగవ్య( పాలు, పెరుగు, వెన్న, మూత్రం, పేడ)లను ఆవు ఇస్తుందని, అహింసకు గోవు ప్రతీకగా మారిందని కోర్టు పేర్కొంది. బ్రహ్మ గురువులను, గోవులను ఒకే సమయంలో సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైనా ఆవును చంపినా, చంపడానికి అనుమతి ఇచ్చినా శరీరంపై వెంట్రుకలు ఉన్నన్ని ఏళ్లు నరకంలో కుళ్లిపోతారని భావిస్తారని కోర్టు తెలిపింది.