Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లయిన కొన్ని రోజులకు భర్తతో కలిసి మేఘాలయ హానీమూన్‌కి వెళ్లిన భార్య, అతడిని దారుణంగా హత్య చేయించింది. రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ రఘువంశీ కిరాయి హంతకులతో హతమార్చింది. సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు కలిసి ఈ మొత్తం హత్యను ప్లాన్ చేశారు. మే 23న హత్య జరిగితే, జూన్ 2న మేఘాలయాలోని కొండల్లో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపూర్‌లో సోనమ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మే 23న మేఘాలయలోని నోంగ్రియాట్ గ్రామంలోని షిపారాలోని హోమ్ స్టే వద్ద చివరిసారిగా రాజా, సోనమ్ కనిపించారు. మే 11న రాజాతో వివాహం జరిగిన కొద్ది రోజులకే సోనమ్, రాజ్ కుష్వాహాలు కలిసి హత్యకు ప్లాన్ చేశారు. హత్య కోసమే మేఘాలయ హనీమూన్‌కి తీసుకెళ్లింది. సోనమ్, రాజాలు కలిసి ట్రెక్కింగ్ కోసం స్థానికంగా కొండల్లోకి వెళ్లిన సమయంలో ముగ్గురు హంతకులు ఆకాష్, ఆనంద్, వికాష్ వీరిని ఫాలో అయ్యారు. అలసిపోయినట్లు నటించిని సోనమ్ వీరి వెనక నడిచింది. నిర్జన ప్రదేశానికి వెళ్లిన తర్వాత, భర్తని చంపేయాలని ముగ్గురిని ఆదేశించింది.
నేరం జరిగిన ప్రదేశానికి 10 కి.మీ దూరంలో సోనమ్ కనిపించిందని, హత్య ఆమె ముందే జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హత్య తర్వాత సోనమ్, ముగ్గురు నిందితులు 11 కి.మీ దూరంలో సమావేశమయ్యారు. అయితే, కీలక సూత్రధారి రాజ్ కుష్వాహా మేఘాలయా వెళ్లలేదు. హత్య తర్వాత సోనమ్ గౌహతికి చేరుకుని, అక్కడ నుంచి రైలులో సొంత ఊరికి బయలుదేరింది. ఆమె మే 25న ఇండోర్ చేరుకుంది. ఆమె ఉండేందుకు రాజ్ ఒక రూంని బుక్ చేశాడు. అక్కడే వీరిద్దరు కలిశారు. ఆదే సమయంలో రాజ్ మరొక హోటల్‌లో బస చేశాడు. దీని తర్వాత ఆమెను యూపీ తీసుకుళ్లేందుకు కారును ఏర్పాటు చేసినట్లు తెలిసింది. సోనమ్ జూన్ 8న అర్థరాత్రి ఘాజీపూర్‌లో లొంగిపోయింది.
Read Also: US Embassy: “అలాంటి వారు అమెరికాకు వచ్చే హక్కు లేదు”.. భారతీయ విద్యార్థికి సంకెళ్లపై వివరణ..
అక్కడే పోలీసులకు అనుమానం:
మేఘాలయా పోలీసులు ఆపరేషన్ హనీమూన్ పేరుతో ఒక పెద్ద దర్యాప్తును ప్రారంభించారు. 120 మంది సిబ్బందితో, ఇందులో 20 మందితో కోర్ టీం ఏర్పాటు చేశారు. జూన్ 07న వారు అనుమానిత ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. సోనమ్‌తో కనిపించిన ముగ్గురు నిందితుల ప్రొఫైళ్లను తనిఖీ చేశారు. ఇండోర్‌లో వీరు బస చేసి ప్రాంతంలో దాదాపు 42 ఫుటేజీల్లో వీరు కనిపించారు.
అయితే, దర్యాప్తు చేస్తున్న సమయంలో ఓ విషయం మాత్రం పోలీసులకు విచిత్రంగా కనిపించింది. హనీమూన్‌కి వచ్చిన జంట ఎలాంటి ఫోటోలు తీసుకోలేదు. సోషల్ మీడియాలో వీరి ఫోటోలను ఎక్కడా షేర్ చేయలేదు. దీంతో పోలీసులు అనుమానం బలపడింది. ఏదో తప్పు జరిగిందని ఆ దిశగా విచారణ ప్రారంభించారు. మే 23న మధ్యాహ్నం 2:15 గంటలకు, సోనమ్ రాజా సోషల్ మీడియా అకౌంట్ ఉపయోగించి తమ బంధం ఏడు జీవితాలకు సంబంధించినదని పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరస్థలంలో రక్తంతో తడిసిన ఆకాష్ చొక్కాను కూడా పోలీసులు కనుగొన్నారు. అక్కడి నుండి 6 కి.మీ దూరంలో దొరికిన తన రెయిన్ కోటును సోనమ్ అతనికి ఇచ్చిందని, పోలీసులను తప్పుదారి పట్టించాలనే ఆమె ప్రణాళికలో ఇది భాగమని వర్గాలు తెలిపాయి.