NTV Telugu Site icon

Himanta Biswa Sarma: బంగ్లాకి చెందిన మైనారిటీలు కాంగ్రెస్‌కి ఓటేశారు.. హిందువులు..

Himanta Sarma

Himanta Sarma

Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌కి చెందిన మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటేశారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వారి కోసం చేసిన అభివృద్ధి పనుల్ని పరిగణలోకి తీసుకోలేదని శనివారం చెప్పారు. అస్సాంలో మతతత్వానికి పాల్పడుతున్న ఏకైక కమ్యూనిటీ ఇదేనని ఆరోపించారు. గౌహతిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిమంత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలైన ఓట్లలో 47 శాతం ఓట్లు బీజేపీ కూటమి సాధిస్తే , కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 39 శాతం ఓట్లు సాధించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ-ఏజీపీ-యూపీపీఎల్ కూటమి 11 స్థానాలను గెలుచుకోగా, మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కి వచ్చిన 39 శాతం ఓట్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాలేదని, ఇందులో 50 శాతం మైనారిటీల ప్రాబల్యం ఉన్న 21 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చాయని, ఈ మైనారిటీల ఆధిక్యత ఉన్న సెగ్మెంట్లలో బీజేపీకి 3 శాతం ఓట్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Read Also: Diarrhea Cases: కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం.. ఇప్పటివరకు ఇద్దరు మృతి

హిందువులు మతప్రాతిపదిక ఓట్లు వేయరని ఇది రుజువు చేస్తోందని, అస్సాంలో ఎవరైనా మతతత్వానికి పాల్పడితే, అది ఒకే వర్గం, ఒకే మతం కారణమవుతోందని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి అన్నారు. మైనారిటీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, కరెంట్ లేదని అయినా కూడా కాంగ్రెస్‌కే ఓట్లు వేశారని చెప్పారు. అస్సామీ ప్రజలు, గిరిజనుల కోసం బీజేపీ పనిచేస్తున్నప్పటీ, ఆ వర్గాలు బీజేపీకి 100 శాతం ఓట్లు వేయలేదని చెప్పారు. కరీంగంజ్‌ మినహా బంగ్లాదేశ్ మూలాలున్న మైనారిటీ ప్రాంతాల్లో 99 శాతం ఓట్లు కాంగ్రెస్‌కి వచ్చాయని చెప్పారు.

వారు ప్రధాని మోడీ ఇచ్చిన ఇళ్లలో నివసిస్తున్నారు, మోడీ అందించిన విద్యుత్, పారిశుద్ధ కార్యక్రమాలను పొందుతున్నారు, కానీ ఓటు వేసేటప్పుడు కాంగ్రెస్‌కి ఓటేస్తారని హిమంత చెప్పారు. రాబోయే 10 ఏళ్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు రాష్ట్రాన్ని నియంత్రించాలనే కోరికతో కాంగ్రెస్‌కి ఓటేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సదరు కమ్యూనిటీ వారు బ్రార్ పేట్ లోని పోలీస్ స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు, బీజేపీ ప్రభుత్వం లేకుంటే ఇలాంటి ఘటనలు మరెన్ని జరుగుతాయో అని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 126 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే, 92 స్థానాల్లో బీజేపీనే ప్రజలు ఆదరించినట్లు తెలిపారు. మా లక్ష్యం 47 శాతం ఓట్ల అని, 2026లో 50 శాతం సాధించడమే లక్ష్యమని చెప్పారు.