NTV Telugu Site icon

Hindi Row: ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించే ప్రశ్నే లేదు, కానీ.. హిందీ వివాదంపై కేంద్రమంత్రి..

Hindi Language Row

Hindi Language Row

Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్‌కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు, కానీ విదేశీ భాషాలపై అతిగా ఆధారపడటం, విద్యార్థులు భాష మూలాలకు గురికావడాన్ని పరిమితం చేయడం జరుగుతుంది’’ అని కేంద్రమంత్రి లేఖలో స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం (NEP) భాష స్వేచ్ఛ సూత్రాన్ని సమర్థిస్తుందని, విద్యార్థులు తమకు నచ్చిన భాషలో నేర్చుకోవడాన్ని కొనసాగించేలా చేస్తుందని అన్నారు. మన భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం, బలోపేతం చేయాలని చూస్తున్నామని ఆయన చెప్పారు.

Read Also: Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్‌పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..

భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద రూ.2,152 కోట్లు వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఒక రోజు తర్వాత విద్యా మంత్రి స్పందన వచ్చింది. ‘‘త్రిభాషా విధానం 1968 నుండి భారతదేశ విద్యా వ్యవస్థలో ఉంది. దురదృష్టవశాత్తు విద్యా విధానంలో భాగమైనప్పటికీ, దానిని ఎప్పుడూ అమలు చేయలేదు. దీని ఫలితంగా పాఠశాలల్లో భారతీయ భాషల క్రమబద్ధమైన బోధన క్షీణించింది’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన పేర్కొన్నారు. మే 2022లో చెన్నైలో ప్రధాని మోడీ నరేంద్ర మోడీ చేసిన ‘‘తమిళ భాష శాశ్వతమైంది’’ అనే వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య ‘‘హిందీ వివాదం’’ కొనసాగుతోంది. హిందీని బలవంతంగా విధించేందుకు తమను కేంద్రం బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆదివారం స్టాలిన్ ఆరోపించారు. తమ రాష్ట్రం అమలు చేస్తున్న ‘‘రెండు భాషల’’ విధానాన్ని వదులుకోమని చెప్పారు. ఈ వివాదంపై సీఎం కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘‘ ఇది ద్రవిడ భూమి, పెరియార్ భూమి. తమిళ ప్రజల హక్కుల్ని హరించడానికి ప్రయత్నించినప్పుడు, ‘‘గో బ్యాక్ మోడీ’’ని ప్రారంభించారు. మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి ‘‘గెట్ అవుట్ మోడీ’’ అనే స్వరం వినిపిస్తోంది’’ అని అన్నారు.