Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఎవరూ ఉండరని, 2032 నాటికి ముస్లింలు కూడా ఆ పార్టీని వదిలి వెళ్తారని అన్నారు. కేంద్రమంత్రి, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిడ్రూగఢ్ నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాలకు చేసిన అనంతరం బిశ్వశర్మ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సభ్యులు బీజేపీలో చేరిన వేగాన్ని మీరు గమనించి ఉండొచ్చని, మీరు దీనిని పరిగణలోకి తీసుకుంటే, రాజీవ్ భవన్ వద్ద కుర్చీలు, గదులు ఉంటాయి కానీ, వీటిలో ఎవరూ ఉండరని, గౌహతిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని ఉద్దేశించి హిమంత వ్యాఖ్యలు చేశారు. 2014లో ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి వేగంగా ముందుకు సాగిందని, 2032 నాటికి కాంగ్రెస్ అంతం అవుతుందని నేను అనుకుంటున్నానని ఆయన అన్నారు.
అస్సాంలో ఏప్రిల్ 19, 26 మరియు మే 7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఇందులో బీజేపీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, దాని భాగస్వామ్య పక్షాలు అసోమ్ గణ పరిషత్ (ఎజిపి) రెండు స్థానాల్లో, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపిపిఎల్) ఒక చోట పోటీ చేయనున్నాయి.