The Kerala Story: సంచలనాలకు కేంద్రబిందువుగా మారిని ‘‘ ది కేరళ స్టోరీ ’’ సినిమాపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ సినిమా సెన్సార్ షిప్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు విచారించింది. ఇప్పటికే ఈ సినిమాపై సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించింది. సెక్యులర్ కేరళ సమాజం ఈ సినిమాను అంగీకరిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది చరిత్రకాదు, కల్పితం అని గమనించిన ఈ సినిమా సమాజంలో మతవివాదాన్ని, సంఘర్షణను ఎలా సృష్టిస్తుందని పిటిషనర్లను ప్రశ్నించింది. సినిమా ట్రైలర్ మొత్తం సమాజానికి వ్యతిరేకంగా ఉందా..? అని అడిగింది.
సినిమా ప్రదర్శించినంత మాత్రన ఏమీ జరగదని, నవంబర్ లో సినిమా టీజర్ విడుదల చేశారని, సినిమాలో అభ్యంతరకరం ఏముంది..?అని, అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పడంలో తప్పేంటని ప్రశ్నించింది. దేశ పౌరులకు నమ్మే హక్కు కల్పించబడిందని, దీంట్లో అభ్యంతరం ఏముందని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంతకుముందు కూడా ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయని, హిందూ, క్రిస్టియన్ పూజారులఅను రిఫరెన్స్ గా సినిమాలు వచ్చాయని, వీటన్నింటిని కల్పగానే చూశారు కదా.. ఈ సినిమాలో స్పెషల్ ఏముంది..? ఈ సినిమా లౌకికవాదాన్ని ఎలా దెబ్బతీస్తుంది..? ఘర్షణకు ఎలా కారణం అవుతుంది..? అని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: Bajrangdal protest: తెలంగాణకు తాకిన కర్ణాటక సెగ.. గాంధీ భవన్ వద్ద టెన్షన్
సినిమాపై స్టే విధించాలని వాదించిన పిటిషనర్లు.. ఈ సినిమా అమాయక ప్రజల్లో విషం నింపుతోందని, కేరళలో ‘లవ్ జీహాద్’ ఉనికిని ఏ సంస్థ కూడా గుర్తించలేదని వాదించారు. జస్టిస్ ఎన్ నగరేష్, జస్టిస్ మహ్మద్ నియాస్ సీపీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ అంశాన్ని పరిశీలించింది. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అదాశర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ లీడ్ క్యారెక్టర్స్ చేశారు.
కేరళలో 35,000 హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు ఇస్లాంను స్వీకరించారని, ఇందులో కొంత మంది ఐసిస్ ఉగ్రసంస్థలో పనిచేయడానికి సిరియా వెళ్లారనే ఇతివృత్తంతో సినిమా రూపొందించారు. దీనిపై కేరళలోని అధికార సీపీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ ఏకంగా ఇది ‘సంఘ్ పరివార్’ ప్రచారం అని విమర్శించారు.