ఓవైపు మహారాష్ట్ర, ముంబైలో కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తుండగా… ఇప్పుడు తౌటే తుఫాన్ హడలెత్తిస్తోంది… తౌటే తుఫాన్ తీరానికి చేరువై… భారీ అలలు తీరాన్ని తాకుతుండడంతో.. ముంబైలో భయానక వాతావరణం ఏర్పడింది.. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం వెంబడి రాకాసి అలలు ఎగిసిపడుతుండగా.. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గంటకు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడుతున్నాయి.. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షంనీరు చేరుకోగా.. ముంబై విమానసర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. ముంబైలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు.. కొన్ని విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కూడా మళ్లించారు అధికారులు. ఇక, ముంబైలో ఈదురు గాలులు, భారీ వర్షంతో.. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.