Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. వచ్చే నెలలో రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందుకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచే అరెస్టులు ప్రారంభించారని ఆమె ఆరోపించారు.
Read Also: Mahua Moitra: ఎథిక్స్ కమిటీ ముందుకు మహువా మోయిత్రా.. 3 మంత్రిత్వ శాఖల నుంచి రిపోర్ట్స్..
వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షా పార్టీలను అదుపు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రతిపక్ష నాయకులందరిన అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తు్న్నారని, తద్వారా దేశంలో ఖాళీ ఏర్పడితే తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవచ్చని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఉపాధి హమీ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు నవంబర్ 16 లోగా విడుదల చేయకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. నవంబర్ 1 వరకే డెడ్ లైన్ విధించినప్పటికీ.. గవర్నర్ హమీ మేరకు కొన్ని రోజులు వేచి చూస్తామని మమతా తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఆప్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. బీజేపీ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని విమర్శించారు. కేజ్రీవాల్ ని జైలులో వేసి ఢిల్లీలోని 7 లోక సభ స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి నేతలను అరెస్ట్ చేయాలని భావిస్తోందని, కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ని అరెస్ట్ చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.