Nuh Rally: గత నెలలో హర్యానాలో మత ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన నూహ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకి వచ్చింది. హిందూ సంఘాలు ఈ రోజు నూహ్ ప్రాంతంలో ర్యాలీకి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఈ రోజు శోభాయాత్రను నిర్వహించేందుకు సిద్ధమైంది.
నూహ్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో వీహెచ్‌పీ మతపరమైన ఉరేగింపు నేపథ్యంలో అధికారులు దీనికి అనుమతి నిరాకరించినప్పటికీ.. భద్రతా చర్యలు పెంచారు. పోలీసులు విస్తృత భద్రత చర్యలు తీసుకున్నారు. బయటి వ్యక్తులు నుహ్ జిల్లాలోకి ప్రవేశించకుండా అధికారులు కఠినమైన ఆంక్షలు అమలు చేశారు. పోలీసులు మరియు పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచారు.
జూలై 31న హిందూ సంఘాలు నిర్వహించిన శోభా యాత్ర తీవ్రమైన మత ఉద్రిక్తతలకు కారణమైంది. శోభాయాత్రపై మరో వర్గం దాడి చేయడంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో వాహనాలను దగ్ధం చేశారు. ఆరుగురు మరణించారు. పోలీసులకు గాయాలయ్యాయి. ఈ అల్లర్ల తర్వాత హర్యానాలోని మనోహర్ లాల్ కట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ మొదలుపెట్టింది. అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లను, అక్రమ నిర్మాణాలను కూల్చేసింది.
Read Also: France: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో ముస్లిం “అబయా దుస్తుల”పై నిషేధం..
మతపరమైన సున్నిత అంశం కావడంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ భక్తులు ఊరేగింపుకు దూరంగా ఉండాలని సూచించారు. బదులుగా ‘జలాభిషేక’ వేడుకల కోసం వారి ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించాలని సూచించారు. అనుమతి నిరాకరించినప్పటికీ, యాత్రను కొనసాగించాలనే ఉద్దేశ్యంలో వీహెచ్‌పీ ఉంది.
మరోవైపు భద్రతా బలగాలు ఐడీ కార్డు ఉన్నవారిని మాత్రమే నూహ్ లోకి అనుమతిస్తోంది. పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అందర్ని తనిఖీ చేస్తున్నారు. 24 కంపెనీల పారామిలిటరీని, 1900 మంది హర్యానా పోలీసులను మోహరించారు. ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలకు అనుమతి లేదని, ఆయుధాలున, తుపాకులు, గొడ్డళ్లను బహిరంగ ప్రదేశాలకు తీసుకురాకుండా పోలీసులు నిషేధించారు. జిల్లా మొత్తం ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేయబడ్డాయి. విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. నలుగురి కన్నా ఎక్కువ మంది వ్యక్తలు గుమిగూడటాన్ని నిషేధించారు.