No one told India to not buy oil from Russia Says Hardeep Singh Puri: రష్యా నుంచి భారత్ పెట్రోలియం కొనడంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. భారత్ తమ పౌరులకు ఇంధనాన్ని అందించడం నైతిక బాధ్యత అని.. అది ఎక్కడ నుంచైనా కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. ఏ దేశం కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారతదేశానికి ఏ దేశం కూడా చెప్పలేదని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని అన్నారు. సరఫరా, డిమాండ్ మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఆయన అన్నారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపై వ్యాపారులపై పడిందని.. ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసిందని ఆయన అన్నారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు ఏప్రిల్ నుంచి 50 రెట్లు పెరిగాయని.. ఇది భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురులో 10 శాతం ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ముందు రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురు కేవలం 0.2 శాతం మాత్రమే అని తెలిపారు.
Read Also: Nashik Bus Accident: మహారాష్ట్రలో ఘోరం.. బస్సులో మంటలు చెలరేగి 10 మంది మృతి
భారతదేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఎక్కడనుంచైనా చమురును కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు కేంద్రమంత్రి. ప్రజలకు ఇంధనాన్ని అందించడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. మీ పాలసీ గురించి మీకు స్పష్టత ఉంటే మీరు ఇంధనం కొనుగోలు చేయాలనుకున్న ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తారని అన్నారు. అమెరికా ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్ హోమ్ తో ద్వైపాక్షిక సమావేశం తరువాత హర్దీప్ సింగ్ పూరి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ ఎనర్జీపై అమెరికా-ఇండియా చర్చించుకున్నాయి. భవిష్యత్తులో రెండు దేశాలు గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి సహకరించుకోనున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేశాయి. ఈ నేపథ్యంలో ఇండియా డిస్కౌంట్ పై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే భారత చర్యపై అమెరికాతో పాటు ఇతర యూరప్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. పలు సందర్భాల్లో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ ను వెస్ట్రన్ మీడియా ఈ విషయంపై ప్రశ్నించింది. అయితే యూరప్ దేశాలు కొనుగోలు చేస్తున్నదాని కన్నా తక్కువగానే ఇండియా కొనుగోలు చేస్తుందని జైశంకర్ సమాధానం ఇచ్చారు.