H3N2 virus Cases: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. కరోనా లక్షణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు హెచ్3ఎన్2 వైరస్ కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను 10 రోజుల పాటు మూసేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. హెచ్3ఎన్2 వైరస్ ఇన్ఫెక్షన్లు పెరగడంతో పుదుచ్చేరి మార్చి 16 నుండి 10 రోజుల పాటు 1 నుండి 8 తరగతులకు పాఠశాలలను మూసివేయనుంది.
Read Also: Pawan Kalyan: ఒక్కరోజుకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఇన్‌ఫ్లుఎంజా ఏ వైరస్ సబ్ వేరియంట్ హెచ్3ఎన్2 తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తోంది. దేశవ్యాప్తంగా ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. నిన్న గుజరాత్ రాష్ట్రంలో ఓ మహిళ హెచ్3ఎన్2 వైరస్ వల్ల మరణించింది. ఈ వైరస్ వల్ల దేశంతో తొలి మరణం కర్ణాటక హసన్ లో నమోదు అయింది. హర్యానాలో కూడా హెచ్3ఎన్2 వల్ల మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, జనవరి 2 మరియు మార్చి 5 మధ్య భారతదేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఈ కొత్త వేరియంట్ వల్ల శరీర నొప్పులు, జ్వరం, చలి, అలసట, డయేరియా, వాంతులు, దగ్గు , గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే మార్చి చివరి నాటికి ఫ్లూ వ్యాధి తగ్గుతుందని కేంద్రం ప్రకటించింది. డాక్టర్ల సూచన లేకుండా సొంత మెడిసిన్స్ వాడొద్దని, యాంటీ బయాటిక్ మాత్రలు వాడొద్దని సూచించింది.