దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపుతోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో తుది విడత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది.. ఆయా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది.. మూడు దశాబ్దాలుగా గుజరాత్‌ను ఏలుతోన్న బీజేపీ.. ఈ సారి అత్యధికంగా ఓట్లు, సీట్లు గెలిచి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. తొలిసారే సత్తాచాలాని ఆప్ తీవ్రంగా శ్రమిస్తోంది. తుది దశ పోలింగ్ జరుగుతోన్న నార్త్ గుజరాత్‌లో గతంలో కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు సాధించిన బీజేపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: Astrology : డిసెంబర్ 05, సోమవారం దినఫలాలు
గుజరాత్‌లో మొత్తం మొత్తం 182 సీట్లు ఉంటే డిసెంబర్ 1వ తేదీన తొలి విడతలో 89 సీట్లకు పోలింగ్ జరిగింది.. 63.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ రెండో దశలో మిగిలిన స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.. ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీతో కలిపి 61 పార్టీల నుంచి మొత్తంగా 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.. బీజేపీ, ఆప్ 93 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టగా.. కాంగ్రెస్ 90 చోట్ల పోటీ చేస్తూ.. తన మిత్రమక్షమైన ఎన్సీపీ అభ్యర్థులను రెండుచోట్ల నుంచి బరిలోకి దించింది.. ఇక, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) 12 చోట్ల, బీఎస్పీ 44 చోట్ల పోటీ చేస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంతా తానై ప్రచారం నిర్వహించారు.. ర్యాలీలు, సభలు, రోడ్‌షోలతో హోరెత్తించారు.. ఒక, తుది దశలో మొత్తం 2.51కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.29 కోట్ల మంది పురుషులు, 1.22కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే 18 నుంచి 19ఏళ్ల యువ ఓటర్లు 5.96లక్షల మంది ఉండటం గమనార్హం. రెండో దశ కోసం 14,975 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1.13లక్షల మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు.