ఒకప్పుడు వయసుకి వస్తే చాలు.. మాకు పెళ్లెప్పుడు మొర్రో అని యువత మొత్తుకునేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మాకు పెళ్లొద్దు మొర్రో అని కేకలు పెడుతున్నారు. పెళ్లంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారు. అసలు పెళ్లి గురించి మాట్లాడటం కాదు కదా, కనీసం ఆ ఆలోచన చేయడానికే పెద్దగా ఆసక్తి చూపడం లేదట!
చదువు, ఉద్యోగాలు, వృత్తులు వంటి వ్యాపకాలపై ఎక్కువగా దృష్టి పెడుతుండటం వల్లే మన దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ యువజన పాలసీ 2014.. ప్రకారం 15 నుంచి 29 సంవత్సరాల వరకు వయసున్న వారిని యువతగా పేర్కొంటారు. 2011 లెక్కల ప్రకారం.. ఈ ఏజ్ గ్రూపులో వివాహాలు కాని వారి శాతం 17 ఉండగా.. 2019 నాటికి ఆ సంఖ్య 23కి పెరిగింది. పురుషుల్లో అవివాహితుల సంఖ్య 20 నుంచి 26 శాతానికి పెరగ్గా.. యువతుల్లో పెళ్లికాని వారి సంఖ్య 13 నుంచి 19 శాతానికి పెరిగినట్టు వెల్లడైంది.
పెళ్లి కాని ప్రసాదుల శాతం జమ్మూ-కాశ్మీర్‌లో అత్యధికంగా ఉన్నట్టు తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. పైన చెప్పుకున్న కారణాలతో పాటు లివ్ ఇన్ రిలేషన్ సంస్కృతి బాగా పెరిగిపోవడం వల్లే యువత పెళ్లిపై ఆసక్తి చూపట్లేదు. దీనికితోడు సింగిల్ పేరెంటింగ్ వైపు యువత మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ముంబాయి, బెంగుళూరు, కోల్ కత్తా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో లివ్ ఇన్ రిలేషన్ సంస్కృతి విపరీతంగా పెరిగినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.
పాశ్చాత్య దేశాల సంస్కృతి యువతపై ప్రభావం చూపడమే కాదు, వారికి ఆర్థికంగా పూర్తి స్వాతంత్రం వచ్చేస్తోంది. దీంతో పెద్దవాళ్లు సైతం ఒత్తిడి చేయలేక, పిల్లల వివాహాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. ఫలితంగా.. వివాహాలు ఆలస్యమవటమో లేదా విముఖత పెరిగిపోవటమే జరుగుతోందని అధ్యయనంలో వెల్లడైంది. అయితే.. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం అవివాహితుల సంఖ్య తక్కువగానే ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రాల్లోని యువత పెళ్లికి అంత విముఖత చూపట్లేదు.