దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలతో… పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులను… బలవంతపు సెలవుపై పంపాలని నిర్ణయించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ నిబంధన అమలుకు ఈ నెల 15 వరకు గడువు విధించారు. ఆరోగ్య కారణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని వారికి మినహాయింపునిచ్చారు. టీకాపై అనుమానాలు వీడీ అర్హులైనవారంతా వేసుకోవాలని ప్రభుత్వాలు మొదటి నుంచి చెబుతున్నాయి. కరోనా నుంచి రక్షించే ఏకైక సంజీవని టీకానే అని పలుసార్లు స్పష్టం చేశాయి. అయినప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్‌పై భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పంజాబ్ ఈ నిర్ణయానికి వచ్చింది.