Patanjali: ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబాకు చెందిన ‘పతంజలి’ తప్పుడు ప్రకటనలో కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద్ ‘తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనల’ కేసులో కేంద్రం తీరుపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రకటనల ద్వారా దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఈ రోజు పేర్కొంది. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రతికూల ప్రకటనలు చేయకుండా కంపెనీని నిలుపుదల చేస్తూ నవంబర్ 2023 నాటి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సుప్రీం కోర్టు కంపెనీ మరియు దాని డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు ధిక్కార నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, ఊబకాయాన్ని మీ మందులు పూర్తిగా నయం చేస్తాయని పతంజలి ఎలా చెప్పగలదంటూ కోర్టు ప్రశ్నించింది. ప్రజల దృష్టిలో అల్లోపతి వైద్యాన్ని ఇలా దిగజార్చలేరని, అల్లోపతి వంటి మరే ఇతర చికిత్స విధానాన్ని మీరు విమర్శలించలేరని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: UAE: కోట్లలో విరాళం ఇచ్చి 900 మంది ఖైదీలను విడిపించిన భారతీయ వ్యాపారవేత్త..
పతంజలి మెడిసిన్స్‌తో ప్రజల్ని తప్పుదోవ పట్టించే అన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ ప్రకటనలను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. తన ఔషధాల విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనల గురించి సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో హెచ్చరించింది. ఇలాంటి వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలని కేంద్రం తరుపు న్యాయవాదిని అత్యున్నత న్యాయస్థానం కోరింది.
ఆయుర్వేద ఔషధాలను తయారు చేస్తున్న పతంజలి సంస్థ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటన చేశాయని, అల్లోపతి, వైద్యులను తక్కువగా అంచనా వేస్తూ అనేక ప్రకటనలు చేశాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రస్తావించింది. ఆధునిక మందులు వాడుతున్నా వైద్యులే చనిపోతున్నారని ఈ ప్రకటనలు చెబుతున్నాయని ఐఎంఏ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.