రక్షణ రంగంలో ఉత్పత్తుల తయారీలో భారత్‌ను స్వయం సమృద్ధిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీన్లో భాగంగానే సుమారు ఐదు లక్షల ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లో ఈ ఆధునిక తుపాకులను తయారు చేయనున్నారు. 7.62 X 39mm క్యాలిబర్ కలిగిన ఏకే 203 రైఫిళ్లను.. ఇన్సాన్ రైఫిళ్ల స్థానంలో వాడనున్నారు. ఇన్సాన్ రైఫిళ్లను ఇండియాలో గత మూడు దశాబ్దాల నుంచి వాడుతున్నారు.
ఏకే-203 సామర్థ్యం సుమారు 300 మీటర్లు ఉంటుంది. ఈ తుపాకీ బరువు చాలా తేలికగా ఉంటుంది. చాలా సులువైన విధంగా దీన్ని వాడొచ్చు. ఏకే-203 రైఫిల్‌లో ఉన్న టెక్నిక్ కూడా సరళమైందని, ఈ తుపాకులను సైనికులు అత్యంత ఖచ్చితత్వంతో వాడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్, రష్యా మధ్య కుదిరిన ప్రత్యేక ఒప్పందం ప్రకారం ఈ రైఫిళ్లను తయారీ చేయనున్నారు. అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్, రోసాబోరాన్ ఎక్స్‌పోర్ట్, కలష్నికోవా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ తుపాకీల ఉత్పత్తి చేపడుతున్నట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.