రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఉమ్మడిగా అభ్యర్థిని పోటీలో పెట్టాలని ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఇందులో భాగంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, అభ్యర్థుల విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అంతే కాదు.. విపక్షాలు అభ్యర్థిగా ఎవరు అనుకున్నా.. నా వల్ల కాదు బాబోయ్ అన్నట్టుగా.. అంతా తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పేర్లు రాష్ట్రపతి ఎన్నికల రేసులో వినిపించినా వాళ్లు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇక, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, గాంధీ మనవుడు గోపాలకృష్ణ గాంధీ పేరు కూడా ప్రముఖంగా వినిపించినా రాష్ట్రపతి ఎన్నికల రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించి ఆయన కూడా విపక్షాలకు షాకింగ్ న్యూస్ చెప్పారు.
Read also: Pawan Kalyan : ఇదే లాస్ట్ అండ్ ఫైనల్..!
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగాలన్న ప్రతిపక్ష పార్టీల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు గోపాలకృష్ణ గాంధీ.. అత్యున్నత పదవికి ఉమ్మడి అభ్యర్థిగా తనను పరిగణలోకి తీసుకున్నందుకు ఓవైపు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తాను మాత్రం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.. జాతీయ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే వ్యక్తి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉండాలని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు.. ఈ విషయంలో తనకంటే మెరుగైనవారు ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు గోపాలకృష్ణ గాంధీ. ఈ పరిణామంతో విపక్షాలకు ఉన్న మరో అవకాశం కూడా లేకుండా పోయినట్టు అయ్యింది.. అయితే, రేపు ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్న విపక్షాలు.. రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి అభ్యర్థిపై చర్చించనున్నారు. మరి ఎవరిని రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపుతారు? అనే విషయంలో ఉత్కంఠ సాగుతూనే ఉంది.