అప్పు తీర్చేందుకు ఓ మహిళ తన 10 తులాల బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టేందుకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఒక మంచి పని చేసింది. తీరా బ్యాంకుకు చేరుకున్నాక చూస్తే, ఆభరణాల సంచి కనిపించలేదు. ఆ మహిళ ఎంత వెతికినా దొరకలేదు. దీంతో.. పోలీసుల్ని ఆశ్రయించగా, అసలు దొంగలు ‘ఎలుకలు’ అని తెలిసి అవాక్కయ్యారు. తిరిగి ఆ సంచిని వెతికి స్వాధీనం చేసుకోవడమూ జరిగింది. డ్రమటిక్‌గా అనిపించే ఈ ఆభరణాల చోరీ కథలోకి వెళ్తే..
గోరేగావ్‌లోని గోకుల్‌ధామ్ కాలనీలో సుందరీ పల్నిబెల్ అనే ఓ మహిళ నివసిస్తోంది. తన కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు.. రూ. 5 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాల్ని బ్యాంకులో తనఖా పెట్టేందుకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఆకలితో ఉన్న ఓ చిన్నారిని చూసి చలించిపోయిన సుందరీ, తన వద్దనున్న వడాపావ్ కవర్‌ను అతనికి ఇచ్చింది. అక్కడి నుంచి నేరుగా బ్యాంకుకు వెళ్లింది. అయితే, బ్యాంకుకు చేరుకున్న తర్వాత బంగారు ఆభరణాల సంచి కనిపించలేదు. కాసేపు కంగారుపడ్డ ఆ మహిళ.. తాను ఏ చిన్నారికైతే వడాపావ్ కవర్ ఇచ్చానో, అందులోనే ఆ సంచి ఉందని గ్రహించి, తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లింది. అయితే, అక్కడికి వెళ్లాక ఆ చిన్నారి కనిపించలేదు.
దీంతో ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆ చిన్నారిని, అతని తల్లిని గుర్తించారు. కవర్ విషయమై వారిని ఆరా తీశారు. వడాపావ్ ఎండిపోవడం వల్ల తాము ఆ ప్యాకెట్‌ను చెత్త కుప్పలో పడేశామని వాళ్లు తెలిపారు. దాంతో ఆ చెత్త కుప్ప సమీపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్ని పోలీసులు పరిశీలించారు. ఆ సంచిని కొన్ని ఎలుకలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఆ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టగా.. ఓ మురుగు కాల్వలో బంగారు ఆభరణాలున్న సంచిని గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకొని, ఆ మహిళకు అప్పగించేశారు.