Gold Coins Found During Excavation In Uttar Pradesh: అదృష్టం ఉంటే మట్టి కూడా మాణిక్యాలుగా మారిపోతాయనే సామెత ఉత్తరప్రదేశ్‌లో నిజమైంది. బాత్రూమ్ కోసం తవ్వితే, ఏకంగా బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. జౌన్‌పూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతానికి చెందిన నూర్జహాన్ కుటుంబం బాత్రూమ్ నిర్మించాలని అనుకుంది. దీంతో కూలీల్ని పిలిపించి, పని మొదలుపెట్టింది. కూలీలు గుంత తవ్వుతుండగా.. ఓ రాగి పాత్ర కనిపించింది. ఆ పాత్రని ఓపెన్ చేయగా.. దాని నిండా బంగారు నాణేలు కనిపించాయి. దాంతో తమ పంట పండిందని వాళ్లు సంతోషించారు.
తొలుత ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, ఎలాగోలా సమాచారం పోలీసులకు అందింది. దాంతో వాళ్లు రంగంలోకి దిగి, ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అవి బ్రిటీష్ కాలానికి (1889-1920) చెందినవిగా గుర్తించారు. రాగి పాత్ర దొరికిన వెంటనే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని పోలీసులు కూలీల్ని ప్రశ్నించారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు తెలిసింది. అయితే.. ఈ బంగారు నాణేల విషయంలో కూలీలు, నూర్జహాన్ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాగి పాత్ర దొరికిన వెంటనే తమకు కొన్ని బంగారు నాణేలు ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేశారట. అందుకు నూర్జహాన్ కుటుంబం ఒప్పుకోకపోవడంతో, కూలీలు మధ్యలోనే పని ఆపేసి వెళ్లిపోయారు.
ఇంకా నాణేలు దొరుకుతాయన్న ఆశలు.. కూలీలు మరుసటి రోజు తిరిగి వచ్చారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఎంత తవ్వినా దొరకలేదు. ఈ క్రమంలోనే నూర్జహాన్ భర్త ఆ కూలీలకు ఓ బంగారు నాణెం ఇచ్చి పంపించాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు కానీ, ఎలాగోలా పోలీసులకు విషయం తెలియడంతో, ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అందరినీ గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.