School Girl Death: ప్రైవేట్ స్కూల్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థిలో మృతి చెందిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. కడలూరు జిల్లా వేప్పూర్‌కి చెందిన బాలిక (16) కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం వద్ద కణియమూరులో ఉన్న ప్రైవేటు పాఠశాల వసతిగృహంలో ఉంటూ 12వ తరగతి చదువుతోంది. ఇటీవల విద్యార్థిని వసతిగృం భవనంపై దూకి పడి చనిపోయింది. పోస్టుమార్టం నివేదికలో శరీరంపై గాయాలు ఉన్నాయని తేలింది. అంతకుముందు దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని దర్యాప్తులో గుర్తించారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని, వాస్తవానికి హత్యాచారం చేశారని మృతురాలి తల్లి ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు కళ్లకురిచ్చి రోడ్డులో ఆందోళన చేపట్టారు. విరుదాచలం ఎమ్మెల్యే రాధాకృష్ణన్ కూడా ఈ మేరకు కళ్లకురిచ్చి కలెక్టరు శ్రీధర్‌కి వినతి పత్రం ఇచ్చారు.
బాలిక మృతికి ఆ పాఠశాల యాజమాన్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కడలూరు జిల్లా వేప్పూర్‌లోని పెరియనాసలూరు గ్రామానికి చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో పాఠశాల వద్దకు తరలివచ్చారు. విధ్వంసం సృష్టించారు. సదరు పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్‌లో విద్యార్థిని మృతికి నిరసనగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులుసహా వందలాది మంది ఆందోళనకారులు ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్‌పై మూకదాడికి దిగారు. బస్సులను తగులబెట్టారు. స్కూల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులను కూడా లక్ష్యంగా చేసుకొని, దాడికి పాల్పడ్డారు. పోలీసు కారును ధ్వంసం చేశారు.
Rajasthan: క్రేజీ దొంగలు.. ఎమ్మెల్యే కారునే చోరీ చేశారు.
దీనిపై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షడు అన్నామలై డిమాండ్ చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో…. పాఠశాల విద్యాశాఖ మంత్రి దీనిపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సీబీసీఐడీకి ఈ కేసును మార్చాలని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ మరో ప్రకటనలో తెలిపారు. గతంలోనూ ఇక్కడ ఐదుగురు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారన్న సమాచారం దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు.ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. నిందితులకు తప్పకుండా శిక్షపడుతుందని హామీ ఇచ్చారు. హింసాత్మక ఘటన తనను కలవరపెడుతోందన్నారు. బాలిక మృతిపై పోలీసుల విచారణ పూర్తికాగానే నిందితులను శిక్షిస్తామన్నారు. వెంటనే కళ్లకురిచ్చికి వెళ్లాలని డీజీపీ, హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారులను కోరారు.