Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే కొత్త పార్టీ స్థాపిస్తారని.. గులాం నబీ ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన జీఎం సరూరీ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో 2019 ఆగస్టు 5వ తేదీకి ముందున్న స్థితిని పునరుద్ధరించాలనే అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్మూ కశ్మీర్‌కు వచ్చి సన్నిహితులతకో సమావేశమవుతారని ఆయన వెల్లడించారు. ఆ తర్వాతే కొత్త పార్టీని ప్రకటిస్తారని చెప్పారు. అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల ఐక్యత కోసం పార్టీ పనిచేస్తుందని సరూరీ స్పష్టం చేశారు. ఆజాద్ బీజేపీ చేరతారన్న వార్తలను సరూరీ కొట్టి పారేశారు. తమ నాయకుడు సిద్ధాంతాలపరంగా లౌకికవాది అని.. ఆయన బీజేపీ పక్కన చేరే అవకాశమే లేదని చెప్పారు. ముందుగా రాష్ట్ర స్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత జాతీయ పార్టీ విషయాన్ని పరిశీలిస్తామని సరూరీ పేర్కొన్నారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆయనకు మద్దతుగా సరూరీ కూడా రాజీనామా చేశారు. ఆయనతోపాటు జమ్మూకశ్మీర్‌కు చెందిన చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. వీళ్లేగాక వందల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సరూరీ ఆజాద్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. సరూరీతో పాటు మరికొందరు నేతలు ఆజాద్‌ను కలిసి రాజకీయ వ్యూహంపై చర్చించారు. ఐదు దశాబ్ధాలుగా కాంగ్రెస్‌లో కొనసాగిన ఆజాద్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు.
Delhi: 47 ఫైళ్లను తిరిగి సీఎంవోకు పంపిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఎందుకంటే?
మరోవైపు ఇవాళ గులాం నబీ ఆజాద్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆనంద్ శర్మ ఢిల్లీలో కలిశారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మల మధ్య దాదాపు గంటకుపైగా భేటీ జరిగింది. ఆగస్టు 26న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జమ్మూకశ్మీర్ మాజీ మంత్రి ఆర్‌ఎస్ చిబ్ కూడా హాజరయ్యారు.