Rent Crime: ఇంటికి అద్దె చెల్లించాలని అడిగినందుకు ఒక ఓనర్ ప్రాణాలు కోల్పోయింది. రెంట్‌కు ఉంటున్న భార్యభర్తలు యజమానిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలో ఉన్న ఘజియాబాద్‌లో జరిగింది. హత్యకు పాల్పడిన దంపతులను అరెస్ట్ చేశారు. యజమానులు దీప్‌శిఖా శర్మ(48) మృతదేహం అద్దె ఫ్లాట్‌లోని ఒక సూట్‌కేసులో లభించింది, దీని తర్వాత నిందితులు అజయ్ గుప్తా, ఆకృతి గుప్తాలను అదుపులోకి తీసుకున్నారు.
ఘజియాబాద్‌లోని రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఆరా చిమెరాలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఇందులో ఉమేష్ శర్మ, దిప్‌శిఖా శర్మలకు రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వీరు ఒక ఫ్లాట్‌లో నివసిస్తు ఉండగా, మరో ఫ్లాట్‌ను గుప్తా దంపతులకు అద్దెకు ఇచ్చారు. అజయ్ గుప్తా ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. అద్దెకు ఉంటున్న దంపతులు సుమారుగా నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన దీప్‌శిఖ, వారి నుంచి అద్దెను రాబట్టాలని ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంటిలో లేడు.
Read Also: YS Jagan: అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వాళ్లను జైల్లో పెడతాం..! జగన్ సంచలన వ్యాఖ్యలు
చాలా సమయం తర్వాత కూడా దీప్‌శిఖ రాకపోవడంతో ఆమె పని మనిషి మీనా ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. చివరిసారిగా ఆమె గుప్తా ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. కానీ నిందితులిద్దరు చెప్పిన సమాధానాలు అనుమానాలను పెంచాయి. మీనా, సీసీటీవీ ఫుటేజ్‌ను చూడగా, దీప్‌శిఖ ఇంట్లోకి వెళ్లినట్లు స్పష్టంగా తెలిసింది. కానీ అందులో నుంచి బయటకు రాలేదని కనుగొన్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఆ సమయంలో గుప్తా దంపతులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పెద్ద సూట్‌కేస్‌తో బయటకు వెళ్లి, ఆటో రిక్షా ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే, దీప్‌శిఖ వచ్చే వరకు ఇంటి నుంచి వెళ్లేందుకు వీలు లేదని మీనా వారిని అడ్డుకుంది.
పోలీసులు గుప్తా దంపతులు అద్దెకు ఉంటున్న ఇంటిలో సోదాలు చేయగా, దీప్‌శిఖ మృతదేహం ఒక సూట్‌కేస్‌లో లభించింది. అద్దె సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలోనే ఆమెను హత్య చేసినట్లు తేలింది. దీప్‌శిఖ తలపై ప్రెజర్ కుక్కర్‌తో కొట్టి, ఆ తర్వాత దుపట్టాతో ఉరివేసి చంపినట్లు విచారణలో వెల్లడైంది. వీరిద్దరిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.