Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాకు నిధులు ఆపేసిన ట్రంప్.. మహ్మద్ యూనస్‌తో ‘‘జార్జ్ సోరోస్’’ కుమారుడు భేటీ..

Bangladesh

Bangladesh

Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్‌పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌‌కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.

వీరిద్దరు ఢాకాలో సమావేశమయ్యారు. సోరోస్, OSF అధ్యక్షుడు బినైఫర్ నౌరోజీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తాత్కాలిక ప్రభుత్వ సంస్కరణల ఎజెండాకు మద్దతు తెలిపినట్లు మహ్మద్ యూనస్ తెలిపారు. “ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి, మోసపోయిన ఆస్తులను కనుగొనడానికి, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి, కీలకమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలను చర్చించడానికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ నాయకత్వం బుధవారం ప్రధాన తాత్కాలిక సలహాదారుని కలిసింది” అని యూనస్ కార్యాలయం ట్వీట్ చేసింది.

Read Also: India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..

ఆర్థిక సంస్కరణలు, మీడియా స్వేచ్ఛ, ఆస్తుల రికవరీ, కొత్త సైబర్ భద్రతా చట్టాలు, రోహింగ్యా సంక్షోభం వంటి అంశాలు చర్చలో కీలకంగా ఉన్నాయని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్ నెలలో అంటే, షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయన రెండు నెలల తర్వాత అలెక్స్ సోరోస్, యూనస్ న్యూయార్క్‌లో కలుసుకున్నారు. మహ్మద్ యూనస్‌ని తన తండ్రి( జార్జ్ సోరోస్) పాత స్నేహితుడు అంటూ అలెక్స్ సోరోస్ ప్రశంసించారు. బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ మరియు సామాజిక కార్యకలాపాలలో తన కృషికి పేరుగాంచిన యూనస్‌కు జార్జ్ సోరోస్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.

అమెరికన్ బిలియనీర్ అయిన జార్జ్ సోరోస్, పలు దేశాల్లో అధికార మార్పిడికి కుట్రలు పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో కూడా షేక్ హసీనాను దించడంలో ఇతడి ప్రమేయం ఉందనే ఆరోపణ ఉంది. బంగ్లాదేశ్‌లో అశాంతికి అమెరికా ప్రమేయం ఉందని గతంలో షేక్ హసీనా వ్యాఖ్యానించింది. ఇటీవల మన దేశంలో కూడా జార్జ్ సోరోస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మన దేశాన్ని అస్థిర పరిచేందుకు జార్జ్ సోరోస్, అతడి సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ బీజేపీ ఆందోళన వ్యక్తి చేసింది. కాంగ్రెస్ పార్టీకి అతడితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.

Exit mobile version