Mamata Banerjee: కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ల ప్రక్షాళన కోసం నిర్వహిస్తున్న ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ పరిణామం రుచించని విషయంగా ఉంది. ఎస్ఐఆర్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలను బహిర్గతం చేసిందని, రాష్ట్రంలో ఆమె పాలన అంతం కాబోతోందని బీజేపీ పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మమతా బెనర్జీ అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వేసిన ఓట్ల కారణంగానే అధికారంలో ఉన్నారని ఈ ప్రక్రియ వెల్లడించిందని బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా అన్నారు.
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 58 లక్షల పేర్లను తొలగిస్తూ మొదటి జాబితా విడుదలైంది. తొలగించబడిన ఓట్లు ఎక్కువగా కోల్‌కతా ప్రాంతంలో జరిగాయి. ఇది సంప్రదాయకంగా టీఎంసీకి పట్టు ఉన్న ప్రాంతం అని మాల్వియా చెప్పారు. మమతకు అనుకూలంగా ఓటేయడానికి గతంలో గైర్హాజరు, బదిలీ చేయబడిన, మరణించిన, నకిలీ ఓటర్ ఎంట్రీలను ఎలా ఉపయోగించుకున్నారో ఇది స్పష్టం చేస్తుందని, ఇప్పుడు ఎస్‌ఐఆర్ ఈ మార్గాన్ని మూసేసిందని, ఈసారి నిజమైన పశ్చిమ బెంగాల్ ఓటర్లు భవిష్యత్తును నిర్ణయిస్తారని, మమతా బెనర్జీ పాలన అంతం చేయడానికి ఓటేస్తారని మాల్వియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దాదాపు 30 లక్షలు ట్రేస్ చేయలేని ఎంట్రీలు ఉన్నాయని, అదనంగా 1.70 కోట్ల పేర్లు స్పష్టమైన అసమానతలు ఉన్నందుకు నోటీసులు అందుకోవచ్చని మాల్వియా అన్నారు. ఈ సంఖ్యను చూస్తే అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వేసిన ఓట్లతోనే మమతా బెనర్జీ అధికారంలో కొనసాగుతున్నారని, ఎస్ఐఆర్ దీనిని మార్చుతుందని బీజేపీ నేత వెల్లడించారు.
ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, మొత్తం 58,20,898 ఓటర్ల పేర్లను తొలగింపు కొసం గుర్తించారు. ఇందులో మరణించినట్లుగా గుర్తించబడిన సుమారు 24,16,852 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత శాశ్వతంగా నివాసం మార్చిన లేదా వలస వెళ్లిన 19,88,076 మంది ఓటర్లు ఉన్నారు. అదనంగా, 12,20,038 మంది ఓటర్లను గల్లంతైనట్లుగా గుర్తించారు, అయితే 1,38,328 పేర్లను నకిలీ, తప్పుడు లేదా బోగస్ నమోదులుగా గుర్తించారు. “ఇతర కారణాల” వల్ల మరో 57,604 పేర్లను తొలగింపు కోసం ప్రతిపాదించారు. తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 14న విడుదల కానుంది. తొలగింపులకు గురైనవారు అవసరమైన పత్రాలతో క్లెయిమ్స్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది.