Theft Case: దొంగతనం చేస్తే శిక్ష తప్పదు. అయితే చిన్నమొత్తంలో చోరీ చేస్తే ఎక్కడైనా పోలీసులు దండించి వదిలిపెట్టేస్తారు. మళ్లీ తప్పు చేయవద్దని హెచ్చరిస్తారు. అయితే రూ.45 దొంగతనం చేసినందుకు న్యాయస్థానం నాలుగురోజుల జైలుశిక్ష విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా 24 ఏళ్లకు ముందు జరిగిన ఈ చోరీ కేసులో ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడం గమనించదగ్గ విషయం. వివరాల్లోకి వెళ్తే.. 1998, ఏప్రిల్ 17వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మైన్‌పురి ఛపట్టీ ప్రాంతానికి చెందిన వీరేంద్ర బాథమ్ అనే వ్యక్తి జేబులో రూ.45 పోయాయి. లైన్ గంజ్ ప్రాంతంలో తన డబ్బులు పోయాయంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Also: Special Story on Tulsi Tanti: మెరుగైన, స్థిరమైన ప్రపంచ సృష్టికి.. అంకితమైన, స్ఫూర్తిమంతమైన జీవితం..
అయితే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటావాలోని భూరా ప్రాంతానికి చెందిన మన్నన్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. దీంతో నిందితుడు మన్నన్‌ను అదుపులోకి తీసుకుని అతడు కొట్టేసిన 45 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైన్‌పురిలోని సీజేఎం కోర్టు ఆదేశాలతో 1998 ఏప్రిల్ 18న నిందితుడిని జైలుకు పంపించారు. 81 రోజుల పాటు జైలులో ఉన్న మన్నన్ ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. అయినా ఈ కేసు మాత్రం ముగియలేదు. 24 ఏళ్లు దాటినా ఈ దొంగతనం కేసు అలాగే నడుస్తోంది. అయితే ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని మన్నన్ భావించాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28న కోర్టుకు హాజరై దొంగతనం చేసినట్టు స్వయంగా ఒప్పుకున్నాడు. దీంతో న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.