కరోనా మహమ్మారి తగ్గడంతో శుభకార్యాలు, పెళ్ళి తంతులు పెరిగిపోయాయి. ఓ పెళ్ళి తంతుకి వెళ్లి భోజనం చేసిన 1200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని మెహసనా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్ళి విందులో ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు జనం. విషయం తెలుసుకున్న అధికారులు ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో విందు భోజనం చేసిన 1200 మందికిపైగా అతిథులు ఆసుపత్రి పాలయ్యారు. గుజరాత్‌లోని మెహసనా జిల్లా విస్‌నగర్ తాలూకా సావల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లిలో ఏర్పాటు చేసిన విందులో ఆహారం కలుషితం కావడం వల్ల ఇది జరిగి వుంటుందని భావిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు.
ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. విందులో అతిథులకు వడ్డించిన ఆహార పదార్థాల్లో మాంసాహారం కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మాంసాహారం నిల్వ వుండడం వల్ల జరిగిందా? లేక వేరే కారణాల వల్ల ఈ ఘటన జరిగిందా అనేది ల్యాబ్ నివేదికలు వచ్చాకే నిర్దారణకు రావచ్చని పోలీసులు అంటున్నారు.