మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయ్. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడలేదు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలింగ్ మరియు కౌంటింగ్ డేటాలో తీవ్ర అసమానతలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే మాదిరిగా ఆరోపణలు చేసింది. ఆ సమయంలో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. తాజాగా మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా ఆరోపణలు గుప్పించింది. కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. అనుమానాలు నివృత్తి చేసేందుకు డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధులను పంపాలని కోరింది.
ఇది కూడా చదవండి: Geyser Explodes: స్నానం చేస్తుండగా గీజర్ పేలి నవ వధువు మృతి..
ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయని.. అయినా కూడా చట్టపరమైన ఆందోళనలు పరిశీలిస్తామని ఈసీ స్పష్టం చేసింది. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలు తెలియజేస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే ఈసీ నుంచి హస్తం పార్టీకి పిలుపు వచ్చింది.
ఇది కూడా చదవండి: Rajendraprasad : అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్రప్రసాద్
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీకి 41, కాంగ్రెస్‌కు 16, ఉద్ధవ్ థాక్రే పార్టీకి 20, శరద్ పవార్ పార్టీకి 10 స్థానాలు దక్కాయి. ఇదిలా ఉంటే మహాయుతి కూటమి విజయం సాధించినా ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి ఎంపికపై హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. ఎటూ తేల్చుకోలేకపోతుంది. దీంతో ఫలితాలు వచ్చి 7 రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. డిసెంబర్ 5లోపు పరిష్కారం దొరకవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏక్‌నాథ్ షిండే అలకబూని.. సొంతూరుకి వెళ్లిపోయారు. ఈ ఉత్కంఠ ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!