Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఈమధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 17న రాజధానిలోని బవానా ప్రాంతంలోన కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన విషయం మరువక ముందే మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలోని నీలోతి గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 10 ఫైరింజన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ ఆవరణలో భారీ మొత్తంలో ప్లాస్టిక్ పైపులు నిల్వ చేయబడి ఉన్నాయి. మంటలు చెలరేగిన ప్రదేశం నుండి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి.ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం సంభవించిన ఫ్యాక్టరీ సమీపంలో మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలని తమ ప్రధమ కర్తవ్యమని.. మంటలు అదుపులోకి రాగానే ప్రమాదానికి సంబంధించిన కారణాలు అంచనావేయనున్నట్టు అధికారులు ప్రకటించారు.