Father Shot Daughter For Marrying A Man From Different Caste: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతురు చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని, తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తను చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు.. కూతురి మృతదేహాన్ని సూట్‌కేసులో ప్యాక్ చేసి, మధురలో వదిలేసి వెళ్లిపోయాడు. వారం రోజుల పాటు ఈ కేసుని విచారించిన అనంతరం.. తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
గత శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద ఒక ఎరుపు రంగు సూట్‌కేసు ఉండడాన్ని కొందరు కార్మికులు గమనించారు. దాని దగ్గరకు వెళ్లి చూడగా.. చుట్టుపక్కల రక్తపు మరకలు కనిపించాయి. దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు.. పోలీసులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాధిత యువతిని ఆయుషీ చౌదరిగా గుర్తించారు. విచారణలో భాగంగా.. తండ్రే కూతురి పాలిట కాలయముడు అయ్యాడని తేల్చారు.
కుటుంబ సభ్యలకు తెలియకుండా.. మరో వర్గానికి చెందిన ఛాత్రపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్లే, తండ్రి నితీష్ యాదవ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు. తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చి చంపినట్లు తెలిపారు. కూతురి మృతదేహాన్ని సూట్‌కేసులో ప్యాక్ చేసేందుకు.. నిందితుడి భార్య సహకరించినట్టు వెల్లడైంది. తండ్రి వద్ద నుంచి గన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫోన్ డేటా, సీసీటీవీ ఆధారంగా పోలీసులు ఈ కేసుని చేధించారు.