Jagjit Singh Dallewal: సీనియర్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ 131 రోజుల తర్వాత ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరలపై (MSP) చట్టపరమైన హామీని, రైతుల డిమాండ్లపై ఆయన గత ఏడాది నవంబర్ 26న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆదివారం రోజున ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో జరిగిన రైతులు సమావేశంలో నిరాహార దీక్ష విరమించే నిర్ణయాన్ని ప్రకటించారు.
దల్లెవాల్ ప్రసంగిస్తూ.. ‘‘మీరందరూ ఆమరణ నిరాహార దీక్ష విరమించమని నన్ను కోరారు. ఆందోళనలో జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు నేను రుణపడి ఉంటా. మీ మనోభావాలను గౌరవిస్తాను. మీ ఆదేశాన్ని అంగీకరిస్తున్నాను’’ అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్, కేంద్ర రైల్వే సహాయమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ప్రకటన వెలువడింది. శనివారం దల్లెవాల్ తన నిరాహార దీక్ష విరమించాలని వారు కోరారు.
Read Also: Uttam Kumar Reddy : తెలంగాణ హక్కుల కోసం ఒక్క అవకాశాన్ని వదులుకోం
శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్‌లో ‘‘భారత ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఇప్పుడు ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చారు. మేము ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఆయన నిరాహార దీక్ష విరమించాలని అభ్యర్థి్స్తున్నాము. మే 4 ఉదయం 11 గంటలకు చర్చల కోసం రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం అవుతాము’’ అని చెప్పారు.
సంయుక్త కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్) మరియు కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM) ల ఉమ్మడి వేదికకు దల్లేవాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంఎస్‌పీ చట్టంతో సహా కీలక డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తూ నిరాహార దీక్షను ప్రారంభించారు. జనవరిలో కేంద్రం, రైతు నాయకలుతో చర్చలు ప్రారంభించిన తర్వాత దల్లేవాల్ వైద్యానికి అంగీకరించారు. అయితే, ఆ సమయంలో ఆయన తన నిరాహార దీక్షను విరమించలేదు. మే 4న రైతు ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరపనుంది.