కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కారు.. ఏకంగా ఏడాదికి పైగా దేశ రాజధాని శివారులో తమ ఉద్యమాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి.. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, ఈ పోరాటం వెనుక రైతు సంఘాలు, వాటికి ప్రాతినిథ్యం వహించిన నేతల కృషి మరువలేనిది… రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్ సింగ్ చదుని.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.. ‘సంయుక్త సంఘర్షణ మోర్చా’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు గుర్నామ్ సింగ్ ప్రకటించారు..
Read Also: ఒమిక్రాన్ పంజా.. క్రిస్మస్ తర్వాత 2 వారాల లాక్డౌన్..!
ఇక, ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధం అవుతోంది ఆ పార్టీ.. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొంటుందని.. స్వచ్ఛ రాజకీయాలు, మంచినేతలను ప్రోత్సహించడమే తమ పార్టీ లక్ష్యమని వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మత్తు పదార్థం ఓపియం తయారీలో వాడే గసగసాల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ పంట సాగుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు గుర్నామ్ సింగ్ చదుని.