West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..

  • బెంగాల్ ‘‘పుష్ప’’ జహంగీర్ ఖాన్ అరెస్ట్..
  • ఎన్నికల అక్రమాల కేసులో నిందితుడు..
  • మమత మేనల్లుడికి అత్యంత సన్నిహితుడిగా పేరు..
Jahangir Khan

Jahangir Khan

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్టా ప్రాంతంలో టీఎంసీ బలమైన నేతగా పేరొందిన జహంగీర్ ఖాన్‌ను వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. భారత్- నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీకి జహంగీర్ ఖాన్ అత్యంత సన్నిహితుడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జహంగీర్ ఖాన్ తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్నాడు. ఫాల్టాలో తానే పుష్ప అని తనను ఎవర ఏం చేయలేరని వ్యాఖ్యానించడం ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం తర్వాత, ఫాల్టా రీ పోలింగ్ నుంచి తప్పుకున్నట్లు జహంగీర్ ఖాన్ ప్రకటించారు. ఈవీఎంలలో అక్రమాలు, బీజేపీ గుర్తు కనిపించకుండా స్టిక్కర్లు అంటించడంలో ఇతడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఇతడిపై 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మధ్యంతర రక్షణ పొడగించేందుకు కలకత్తా హైకోర్టు నిరాకరించడంతో అతడిని అరెస్ట్ చేశారు.

×
×
Ad

ఫాల్టాలో ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆ సమయంలో ఈసీ ఫాల్టా ఎన్నికల్ని రద్దు చేసింది. తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జహంగీర్ ఖాన్ ప్రకటించారు. రీ పోలింగ్‌లో బీజేపీ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఎన్నికల సమయంలో ప్రత్యే పరిశీలకుడిగా నియమితులైన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు సవాల్ విసిరారు. ‘‘సింగం’’ పోలీస్ అధికారిగా పేరున్న అజయ్ పాల్‌ను ఉద్దేశిస్తూ జహంగీర్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన సింగం అయితే, తాను పుష్ప అంటూ అభివర్ణించుకున్నాడు. ఫాల్టా రీ పోలింగ్‌లో టీఎంసీ 4వ స్థానానికి పరిమితైంది.