మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎట్టకేలకు ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజులకి మహారాష్ట్ర సీఎం ఎంపిక పూర్తయింది. గురువారం (05-12-2024) ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆజాద్ మైదాన్‌లో వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం ఫడ్నవిస్‌తో షిండే భేటీకానున్నట్లు తెలుస్తోంది. శాఖలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Devendra Fadnavis: ఆశ్చర్యపరిచిన ఫడ్నవీస్ కొత్త పేరు.. ఆహ్వానపత్రిక వైరల్..
ఇదిలా ఉంటే మహాయుతి కూటమిలో భాగంగా శివసేన ముఖ్యమంత్రి పోస్టు కోసం చాలా గట్టిగా పట్టుబట్టింది. సీఎం పంచాయితీ కారణంగానే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్ని రోజుల సమయం పట్టింది. అయితే ఈ పంచాయితీ పరిష్కరించడానికి కేంద్ర పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కేంద్రం నియమించింది. మొత్తానికి వీరిద్దరు రంగంలోకి దిగి ఏక్‌నాథ్ షిండేను ఒప్పించారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఆయన అంగీకరించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
ఇది కూడా చదవండి: RTC Driver Meets Nara Lokesh: ‘దేవర’ పాటకు స్టెప్పులేశాడు.. మంత్రి లోకేష్‌ని కలిశాడు..
అయితే కొత్త ప్రభుత్వంలో 7:7:7 నిష్పత్తిలో కూటమిలో ఉన్న మూడు పార్టీలు మంత్రుల పదవులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఏడుగురు, శివసేన నుంచి ఏడుగురు, ఎన్సీపీ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రి పదవులుపై చర్చించేందుకు బుధవారం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఏక్‌నాథ్ షిండే భేటీకానున్నట్లు తెలుస్తోంది. శివసేనకు సంబంధించిన ఫోర్ట్ ఫోలియోపై షిండే చర్చించనున్నారు. ఇక ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ -132, శివసేన-57, ఎన్సీపీ-41, కాంగ్రెస్-16, ఉద్ధవ్ థాక్రే-20, శరద్ పవార్-10 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Bank Duties: 5 రోజుల పని దినాలపై ఏఐబీఓసీ కీలక ప్రకటన.. భవిష్యత్ ప్లాన్ ఇదే!