Awadhesh Prasad: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను అయోధ్య బాలిక సామూహిక అత్యాచార ఘటన కుదిపేస్తోంది. బేకరీలో పనిచేసే 12 ఏళ్ల బాలికపై బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిందితుడు మోయిద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త కావడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనపై యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ చర్యలకు హామీ ఇచ్చారు. నిందితుడికి సంబంధించిన బేకరీని బుల్డోజర్లతో కూల్చివేశారు.
అయితే, ఈ ఘటనపై అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ, ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి యాదవ్, ముస్లిం వర్గాలతో శత్రుత్వం ఉందని శనివారం ఆరోపించారు. నిందితుడికి చెందిన ఖాన్ బేకరీని కూల్చివేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, నేరాలు చేసేవారికి మద్దతుగా ఎస్పీ ఎప్పుడూ నిలబడదని, మైనర్ బాలిక అత్యాచారాన్ని రాజకీయం చేయవద్దని బీజేపీని కోరారు.
ఎంపీ అవధేశ్ టీంలో నిందితుడు సభ్యుడని, అతనికి సమాజ్ వాదీ పార్టీలో సంబంధం ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆరోపించారు. బాలిక అత్యాచార ఘటనలో సంబంధం ఉన్నప్పటికీ అతడిపై ఆ పార్టీ చర్యలు తీసుకోలేదని అన్నారు. మరోవైపు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిందితులకు డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. మీ హయాంలో ఎంతమంది నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారని అధికార బీజేపీతో పాటు బీఎస్పీ ఫైర్ అవుతోంది.