Starlink: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారతదేశం కీలక అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు తుది అనుమతులు వచ్చినట్లు అయింది. బుధవారం దేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి ఆమోదం పొందింది. జెన్ 1 లోఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్స్ ఉపయోగించి ఇంటర్నెట్ సేవలు అందించడానికి మార్గం సుగమం అయింది. దేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవలు, కమర్షియల్ శాటిలైట్ బ్రాండ్‌బ్యాండ్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి తుది నియంత్రణ అడ్డంకులు తొలిగిపోయాయి.
Read Also: Xi Jinping: జిన్‌పింగ్ అదృశ్యం.. ఈ ఆరుగురి నుంచే చైనా కొత్త అధ్యక్షుడు..
దేశంలో మారుమూల ప్రాంతాల్లో వేగంగా, తక్కువ ధరకు ఇంటర్నెట్ అందించే అవకాశం ఉంది. నేరుగా శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ రావడం మూలంగా హైస్పీడ్‌ని పొందవచ్చు. దేశంలో డిజిటల్ రంగం అభివృద్ధి మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. స్టార్‌లింక్ జెన్1 అనేది 540 మరియు 570 కిలోమీటర్ల మధ్య ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న 4,408 ఉపగ్రహాల సమూహం. ఇది నెక్ట్స్ జనరేషన్ కమ్యూనికేషన్ విస్తరణను వేగవంతం చేస్తుందని, డిజిటల్ అంతరాన్ని తగ్గించి, ప్రభుత్వ డిజిటల్ ఇండియా దార్శనికతకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం, స్టార్ లింక్‌కు మొత్తం 6,750 కంటే ఎక్కువ శాటిలైట్స్ ఉన్నాయి. మంగోలియా, జపాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా, జోర్డాన్, యెమెన్, అజర్‌బైజాన్ మరియు శ్రీలంకతో సహా అనేక దేశాలలో స్టార్‌లింక్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. స్టార్ లింక్ ప్రత్యర్థి అయిన అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ కూడా భారత అనుమతుల కోసం వేచి చూస్తోంది. కైపర్ భారతదేశంలో పెద్ద ఎత్తున విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.