MK Stalin: తమిళనాడులో మరో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ ఈడీ వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించారు. ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందన్నారు. తమిళనాడు మంత్రుల ఇళ్లల్లో ఈడీ వరుస సోదాలు చేపట్టడం రాజకీయ దుమారానికి దారితీస్తోంది. తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. మనీలాండింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తమిళనాడు మంత్రి కె. పొన్ముడి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం సోదాలు చేపట్టారు.
Read also: Nidhi Agarwal: ఆ డ్రీమ్ ఇప్పట్లో నెరవేరేలా లేదు…
2007 నుంచి 2011 మధ్య గత డీఎంకే ప్రభుత్వంలో పొన్ముడి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో క్వారీ లైసెన్సు నిబంధనలను ఉల్లంఘించారని, గనుల కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సిగమణి పొన్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు. కాగా మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే మరో మంత్రిపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్రపూరితంగానే తమ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని డీఎంకే మండిపడింది.
Read also: Electric Cycle: మార్కెట్‌లోకి ఎలక్ట్రికల్ సైకిల్.. రూ.10 ఖర్చుతో 100 కి.మీ ప్రయాణం
విపక్షాల సమావేశం కోసం బెంగళూరు బయల్దేరిన సీఎం స్టాలిన్ ఈడీ సోదాలపై స్పందించారు. ‘‘ఇటీవలే పొన్ముడిపై ఉన్న రెండు కేసులను కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈడీ సోదాలు చేపట్టింది. ప్రతిపక్షాల భేటీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మా కోసం తమిళనాడు గవర్నర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈడీ కూడా ఈ ప్రచారంలో చేరింది. ఇక మా ఎన్నికల పని సులువు అవుతుందని భావిస్తున్నానటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఈడీ చేపట్టే ఈ దాడులు సాధారణమేనని, ఇలాంటి బెదిరింపులకు డీఎంకే భయపడదని స్టాలిన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కూడా ఈడీ సోదాలను తీవ్రంగా ఖండించింది. ‘‘విపక్షాల భేటీకి ముందు తమిళనాడు మంత్రిపై దాడులు జరగడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. విపక్షాలను విడగొట్టేందుకు మోదీ ప్రభుత్వం రాసిన స్క్రిప్ట్ ఇది.. మోదీ ప్రభుత్వం పాల్పడుతున్న ఈ రాజకీయ కుట్రలపై పోరాడేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు చేసే ఈ ప్రయత్నాలకు మేం ఎన్నడూ తలొగ్గంమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు.