బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే దేశాన్ని కుదిపేస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ.. ఇటు బీహార్ అసెంబ్లీలోనూ ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అయితే ఒక అడుగు ముందుకేసి.. తక్షణమే సర్వే గనుక ఆపకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇక సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులైంది. కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా సభ నడవలేదు. ఉభయ సభల్లో ఓటర్ సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో వరుస వాయిదాల పర్వం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Air Asia Flight: గాల్లో ఉండగా ఘర్షణ.. ప్రయాణికుడ్ని చితకబాదిన లేడీ గ్రూప్
ఓటర్ సర్వేపై ఆందోళనలు, నిరసనలు తీవ్ర అవ్వడంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తామంటూ ప్రశ్నించారు. ఓటర్లను తొలగిస్తు్న్నారంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రం తొలగిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Jaggery: రాత్రిపూట బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో..!
భారత రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది అని అన్నారు. ఎన్నికల కమిషన్ వ్యక్తులచే తప్పుదారి పట్టదన్నారు. చనిపోయిన ఓటర్లు, వలస వచ్చిన ఓటర్లు, రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న వారు. నకిలీ ఓట్లను, విదేశీ ఓటర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు చెప్పారు. తొలుత బీహార్‌లో ఈ సర్వే చేపట్టామని.. అనంతరం దేశమంతా నకిలీ ఓట్లను తొలగిస్తామని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.
బుధవారం ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. బీహార్ ఓటర్ల జాబితా నుంచి 56 లక్షల పేర్లను తొలగించడానికి గుర్తించారు. 56 లక్షల పేర్లలో 20 లక్షల మంది చనిపోయిన ఓటర్లు, 28 లక్షల మంది శాశ్వతంగా వేరే రాష్ట్రానికి వెళ్లినవారు. ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో నమోదు చేసుకున్న 7 లక్షల మంది వ్యక్తులు. 1 లక్ష మంది సంప్రదించలేని ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 15 లక్షల మంది ఓటర్ ధృవీకరణ ఫారాలు ఇవ్వలేని వారు ఉన్నారని తెలిపింది. వీళ్లంతా తుది జాబితా నుంచి తొలగింపబడతారని సంకేతం ఇచ్చింది.
ఇక ఓటర్ సర్వేపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. తుది జాబితా సమయానికి అన్ని సంక్రమంగా చూసుకోవాలని ఈసీకి సూచించింది. ఇక సవరణ ప్రక్రియలో ఆధార్, ఓటర్ ఐడీ పత్రాలను ఎందుకు తీసుకోవడం లేదని ఈసీకి సుప్రీం ధర్మాసనం అడిగింది. ఇక సెప్టెంబర్‌లో ఈసీ తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.