NISAR: భారత్, అమెరికా కలిసి సంయుక్తంగా తయారు చేసిన ‘ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ అయిన ‘‘’NASA ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) శాటిలైట్’’ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సాంకేతిక అద్భుతం, గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చెబతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రాణాలను కాపాడేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. 1.3 బిలియన్ డాలర్ల పైగా ఖర్చుతో భారత్, అమెరికాలు కలిసి ఈ శాటిలైట్‌ని రూపొంందించాయి.
భారత్ లోని శ్రీహరికోట లాంచింగ్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరుగుతుంది. భారతీయ రాకెట్ ద్వారా నిసార్‌ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఒకప్పుడు, 90లలో అమెరికన్లు ఈ రాకెట్ అభివృద్ధిని దెబ్బతీయాలని చూశారు, ఇప్పుడు అదే రాకెట్ ద్వారా నిసార్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడుతుంది. జూలై 30న ఈ రాకెట్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేయబడుతుంది.
ఇస్రో చెబుతున్న దాని ప్రకారం.. నిసార్ ఉపగ్రహం 2392 కిలోల బరువు ఉంటుంది. 12 రోజుల వ్యవధిలో ఇది మొత్తం భూమిని అన్ని వాతావరనాలు, పగలు, రాత్రుల్ని స్కాన్ చేసి డేటా ఇస్తుంది. నిసార్ భూమి ఉపరితలంపై మార్పులను, మంచు పలకల కదలికలు, వృక్ష సంపద మార్పులు చేర్పులను గుర్తించగలదు. దీనిని జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 2 (GSLV మార్క్ 2) రాకెట్ ఉపయోగించి ప్రయోగిస్తారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజన్‌తో పనిచేసే రాకెట్. 90లలో ఈ సాంకేతికత భారత్‌కు రష్యా నుంచి అందకుండా అమెరికా అడ్డుకుంది.
క్రయోజనిక్ టెక్నాలజీలో భారత్ విజయం:
ఎక్కువ బరువు ఉండే, ఎర్త్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి భారీ రాకెట్లు అవసరం అవుతాయి. ఇది క్రయోజనిక్ టెక్నాలజీ ఉపయోగించుకుంటుంది. 1990 లలో భారత్, అప్పటి సోవియట్ యూనియన్ నుంచి క్రయోజనిక్ టెక్నాలజీని పొందాలనుకుంది. అయితే, రష్యా నుంచి ఈ టెక్నాలజీ భారత్‌కు చేరకుండా అమెరికా ఒత్తిడి తెచ్చింది. అయితే, రష్యా దాదాపుగా 6 రెడీమేడ్ క్రయోజనిక్ ఇంజన్లను భారత్‌కు ఇచ్చింది. దీని తర్వాత, భారత్ సొంతగా తన క్రయోజనిక్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకునేందుకు 20 ఏళ్లు కష్టపడింది.
అమెరికా తిరస్కణలు భారత్‌ని మరింత సమర్థంగా పనిచేసేలా చేసింది. ఈ టెక్నాలజీ పొందకుందా భారత్‌పై ఆంక్షలు, ఒత్తిడిని కూడా ప్రయోగించింది. భారత శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం, ఈ నిసార్ శాటిలైట్‌ని జీఎస్ఎల్వీ మార్క్ -2 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు. దీనికి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్లను వాడుతున్నారు. చివరకు అమెరికా అహంకారాన్ని భారత్ సవాల్ చేసి ఈ టెక్నాలజీని సాధించింది.
నాసా-ఇస్రో సహకారం:
నిసార్ నాసా, ఇస్రోల 50:50 శాతం భాగస్వామ్యంతో తయారవుతోంది. నిసార్ ప్రాజెక్ట్ కోసం భారత్ ఏకంగా రూ. 800 కోట్లు ఖర్చు చేసింది. ఇది ఈ శాటిలైట్ చెట్లు, మట్టి ఉన్నప్పటికీ, వాటి గుండా చొచ్చుకుపోయి భూమి మార్పులను అంచనా వేస్తుంది. దీని కోసం ఆప్టమైజ్ చేసిన S-బ్యాండ్ రాడార్‌ను ఉపయోగిస్తుంది. ఈ రాడార్‌లు 12 మీటర్ల మెష్ రిప్లెక్టర్ యాంటెన్నాపై అమర్చబడి ఉంటుంది. ఇది దాదాపుగా స్కూల్ బస్ పరిమాణంలో ఉంటుంది. ఈ శాటిలైట్ భూమి, మంచు ఉపరితలాలను ప్రతీ 12 రోజులకు రెండుసార్లు స్కాన్ చేస్తుంది.
భారత్ ఎస్-బ్యాండ్ రాడార్‌ను అందించడమే కాకుండా, రాకెట్ లాంచింగ్, ప్రయోగ సేవలను కూడా అందిస్తోంది. ఇక్కడ కూడా భారత్ అతి తక్కువ ధరతో మంచి టెక్నాలజీని అందించింది. భారత్ ఖర్చు పెట్టినదాని కన్నా నాసా ఎక్కువ ఖర్చు పెట్టింది. మరోసారి నాసా తన చవక ఫార్ములాను పాటించింది. నిసార్ నిర్మాణానికి దాదాపుగా 11 ఏళ్లు పట్టింది. దీనికి ఇస్రో బృందాలు, నాసా శాస్త్రవేత్తలతో పోలిస్తే తక్కువ జీతాలకు, వీకెండ్స్‌లో కూడా పనిచేశారు. నిజానికి, భారత్ ప్రయోగించిన మార్స్ మిషన్ ‘‘మంగళ్‌యాన్’’ ఖర్చు హాలీవుడ్ మూవీ ‘‘గ్రావిటీ’’ కన్నా తక్కువ. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఇస్రో తక్కువ ఖర్చుతో ఎలాంటి అత్యుత్తమ టెక్నాలజీ తీసుకువస్తుందో తెలియజేయడానికి.