దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి కేంద్ర వాతావరణ శాఖ దుమ్ము తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ సంభవించొచ్చని సూచించింది. గురు, శుక్రవారాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొంది. చెట్లు, పాత భవనాల దగ్గర ఉండొద్దని తెలిపింది. ఐఎండీ దుమ్ము తుఫాన్ హెచ్చరికలతో విమాన సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఎయిరిండియా.. ప్రయాణికులను అలర్ట్ చేసింది. వెబ్‌సైట్ చెక్ చేసుకుని ప్రయాణాలు చేయాలని కోరింది.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: ప్రధాని మోడీ విమర్శలపై మమత సవాల్.. టీవీ డిబేట్‌కు రావాలని పిలుపు
గత కొద్ది రోజులుగా ఢిల్లీని దుమ్ము తుఫాన్ వణికిస్తోంది. భీకరమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి నానా బీభత్సం అయింది. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఇక విమాన సర్వీసులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. విమానాలను దారి మళ్లించడంతో గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..
ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించాయి. దీంతో కేరళ, గోవా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబైలో అయితే నగరం అతలాకుతలం అయింది. రహదారులు జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్‌లు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడడంతో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.