భారత రాష్ట్రపతిగా ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర సృష్టించారు.. విపక్షాల అభ్యర్థి యశ్వంత సిన్హా మీద భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. అధికారపక్షం వర్సెస్ విపక్షాల ఫైట్‌లో, అధికారపక్షమే నెగ్గింది. ప్రెసిడెంట్ పోల్స్‌లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఏడున్నర పదుల దేశ స్వాతంత్ర చరిత్రలో తొలిసారి… గిరిజన మహిళ ప్రథమ పౌరురాలిగా గెలిచి సంచలనం సృష్టించారు ముర్ము. రాజ్యాంగ పరిరక్షురాలిగా దేశాన్ని శాసించనున్నారు. ప్రతిభా పాటిల్ తరువాత రాష్ట్రపతి అయిన రెండవ మహిళగా కూడా రికార్డుని సొంతం చేసుకున్నారు. బీజేపీ తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలిచి మంచి మెజారిటీతో గెలిచిన ద్రౌపది ముర్ము.. ఈ దేశ మూలవాసులకు ఒక ఉదాహరణ. అణగారిన వర్గాలకు ఒక ఆలంబన. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి దేశంలో అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు.
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్‌లో ఎంపీల ఓట్లు లెక్కించారు. మొత్తం 763మంది ఎంపీలు ఓటు వేయగా.. వీటిలో 15 ఓట్లు చెల్లలేదు. దీంతో 748 ఓట్లలో ద్రౌపదీ ముర్ముకు 540 ఓట్లు రాగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో ద్రౌపదీ ముర్ము భారీ ఆధిక్యత సాధించారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల సంఖ్య 1138 కాగా.. వీటిలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు 809 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 329 ఓట్లు వచ్చాయి. ఇక, మూడో రౌండ్‌లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ఓట్లను లెక్కించారు. ఈ రౌండ్‌లో 1333 ఓట్లు చెల్లుబాటు కాగా.. వీటిలో ద్రౌపదీ ముర్ముకు 812 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో మొత్తంగా 4,754 ఓట్లు పోలవ్వగా.. 53 ఓట్లు చెల్లుబాటు కానివిగా గుర్తించారు. చెల్లుబాటైన 4,701 ఓట్లలో ద్రౌపదీ ముర్ము 2,824 ఓట్లు సాధించగా.. యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు పోలయ్యాయి. దీంతో ద్రౌపదీ ముర్ము నూతన రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికంగా ప్రకటించారు.
ఈనెల 25న ప్రమణస్వీకారం
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, పార్టీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీజేపీ నేతల సంబరాలకైతే హద్దే లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలను మొదలుపెట్టింది. ఢిల్లీలోని ముర్ము నివాసానికి బీజేపీ అగ్ర నేతలు క్యూ కట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి అందరికంటే ముందు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ… ముర్ముకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అక్కడికి వచ్చారు. ముర్ముకు అభినందనలు తెలిపిన అమిత్ షా… తన చేతులతో ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమిత్ షా అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ముర్ము నివాసానికి వచ్చి అభినందనలు తెలిపారు. ఇక ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు… ద్రౌపది ముర్ము. ఈనెల 25న ఆమె ప్రమణస్వీకారం చేయనున్నారు. మరోవైపు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. దేశంలో పలు విభేదాలు పొడచూపుతున్న వేళ రాజ్యాంగ ఆదర్శాలు కాపాడి.. ప్రజాస్వామ్య పరిరక్షురాలికగా ద్రౌపది ముర్ము నిలవాలంటూ… మమత బెనర్జీ ఆకాంక్షించారు.