ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ నేత, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం వరసగా ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు ద్రౌపతి ముర్ముకు ఘనంగా స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే రేపు (జూన్ 24)న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ఎన్డీయే ముఖ్యమంత్రులు హజరయ్యే అవకాశం ఉంది. ద్రౌపతి ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సమాజంలోని అన్నివర్గాల ప్రజలు ప్రశంసించారని.. అట్టడుగు సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, భారత దేశ అభివృద్ధికి సంబంధించిన దృక్పథం అత్యద్భుతం అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపనున్నాయి. టీఎంసీ పార్టీలో ఇటీవల చేరిన ఆయన తాజాగా తన రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం పార్టీకి రాజీనామా చేశారు. అయితే ముందుగా విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థులుగా శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ విపక్షాలు అనుకున్నప్పటికీ.. వారంతా తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దీంతో యశ్వంత్ సిన్హాను, ద్రౌపతి ముర్ముకు పోటీగా నిలబెట్టాయి విపక్షాలు.